కొత్తగా కట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు కొట్టుకుపోతుంటే వందేళ్ల కిందట కట్టిన ప్రాజెక్టులు మాత్రం ఎంతో పటిష్టంగా ఉన్నాయి. అందులో ప్రధమ స్థానంలో నిలుస్తున్నది పోచారం ప్రాజెక్టు. 103 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ పురాతన పోచారం ప్రాజెక్ట్ 1,82,000 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుంది సురక్షితంగా నిలబడింది.
ఈ ప్రాజెక్టు MFD 70,000 (గరిష్ట వరద) క్యూసెక్కుల కంటే ఈ వరద చాలా ఎక్కువ. గురువారంనాటి ఉద్రిక్త క్షణాల తర్వాత, ప్రాజెక్ట్ బలంగా నిలబడటం నీటి పారుదల శాఖ సహచరులకు గొప్ప ఉపశమనం కలిగించింది. నిజంగా ఇది గర్వించదగ్గ సమయం.
వందేళ్ల క్రితం నిజాం ప్రభుత్వం నిర్మించిన తెలంగాణ తొలి ప్రాజెక్టు పోచారం ప్రాజెక్టు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ప్రస్తుతం కామారెడ్డి జిల్లాగా ఉన్న మంచిప్ప చెరువుపై నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో 1917లో పోచారం ప్రాజెక్టుకు నిజాం శంకుస్థాపన చేశారు.
కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలాల నీటి అవసరాలను తీర్చేందుకు రూ.27.11 లక్షల వ్యయంతో 2.423 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 1922లో పూర్తయింది. గత 103 ఏళ్లుగా నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను ఈ పోచారం తీరుస్తున్నది.
నిజాం ప్రభుత్వం సున్నపురాయితో నిర్మించిన ఈ ప్రాజెక్టు పొడవు 1.7 కిలోమీటర్లు, మంచిప్ప వాగుపై 21 అడుగుల ఎత్తైన కట్ట, దాని చుట్టూ 58 కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వారు. ఈ ప్రాజెక్టు కు 73 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కింద రైతులు 10,500 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు.
గతంలో 2.423 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించగా, పూడిక కారణంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలకు పడిపోయింది. ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీలను ఏ, బీ జోన్లుగా, 1 నుంచి 48 డిస్ట్రిబ్యూటరీలతో కూడిన ఏ జోన్, 49 నుంచి 73 డిస్ట్రిబ్యూటరీలతో కూడిన బీ జోన్లుగా విభజించారు.