సంపాదకీయం హోమ్

గూగుల్ కు విశాఖే ఎందుకు నచ్చింది?

#Google

దేశంలో ఇన్ని ప్రదేశాలు ఉండగా గూగుల్ సంస్థ తన అతి పెద్ద డేటా సెంటర్ ను ఏర్పాటు చేసుకోవడానికి విశాఖపట్నం ను ఎందుకు ఎంపిక చేసుకున్నది? ఈ ప్రశ్న చాలా మందిలో ఉద్భవిస్తున్నది కానీ సరైన సమాధానం రావడం లేదు. ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్ ను గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నదనే వార్త కన్నా విశాఖను ఎంపిక చేసుకోవడానికి గూగుల్ చేసిన అధ్యయనం ఆసక్తికరంగా ఉన్నది.

గూగుల్ విశాఖపట్నాన్ని ఎంచుకోవడానికి ముందస్తుగా ఎన్నో అధ్యయనాలు చేసింది. మరీ ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబునాయుడి ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటా సెంటర్ పాలసీని ప్రకటించడం గూగుల్ ను ప్రత్యేకంగా ఆకర్షించింది.

రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఐటీ రంగాల్లో నైపుణ్యం కలిగిన యువత ఉండటం వల్ల డేటా సెంటర్‌కు కావాల్సిన మానవ వనరుల లభ్యత సులభంగా చేకూరుతుందని గూగుల్ భావించింది. అంతేకాక విశాఖ ఇప్పటికే ఐటీ, ఫిన్‌టెక్, స్టార్టప్ హబ్‌గా ఎదుగుతున్నందున భవిష్యత్తులో గ్లోబల్ కంపెనీలు తమ సర్వర్లు ఇక్కడ హోస్ట్ చేసుకునే అవకాశం ఉంది.

ఈ రెండు కారణాలు దేశంలోని చాలా రాష్ట్రాలలో ఉండే అవకాశం లేదు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా మొత్తం భారతదేశానికి డిజిటల్ హబ్‌గా అవతరించనుంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలకు ఇది కీలకంగా మారనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

విశాఖను ఎంపిక చేయడానికి గల మరిన్ని కారణాలు చూస్తే విశాఖపట్నానికి భౌగోళిక ప్రాధాన్యం ఉంది. సాంకేతిక మౌలిక వసతులు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మానవ వనరుల లభ్యత ప్రధాన పాత్ర పోషించాయి. విశాఖపట్నం తూర్పు తీరంలో ఉండటంతో అంతర్జాతీయ సబ్‌మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు దగ్గరగా ఉంటుంది.

దీని వలన అమెరికా, జపాన్, సౌత్ఈస్ట్ ఆసియాతో వేగవంతమైన గ్లోబల్ కనెక్టివిటీ సాధ్యం అవుతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డేటా సెంటర్ పాలసీని ప్రకటించి భూమి, విద్యుత్, నీరు, పన్ను మినహాయింపులు, గ్రీన్ ఎనర్జీ వాడకానికి ప్రోత్సాహకాలు కల్పిస్తోంది.

విశాఖలో ఇప్పటికే ఉన్న విద్యుత్ సరఫరా, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌లు, సముద్రతీర ప్రాంతం వలన లభించే నీటి వనరులు గూగుల్ ప్రాజెక్టుకు మరింత అనుకూలంగా మారాయి. డేటా సెంటర్లకు అవసరమైన భారీ కూలింగ్ సిస్టమ్‌ల నిర్వహణకు ఈ నగరం సరైన వాతావరణాన్ని కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు.

తుపాన్లు ఇతర ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ప్రాంతాలను గూగుల్ ఎంపిక చేసుకోదు. అయినా సరే గూగుల్ విశాఖను ఎంపిక చేసుకోవడానికి ఎన్నో బలమైన కారణాలు ఉండటంతో ప్రకృతి వైపరీత్యాల గురించి పెద్దగా ఆలోచించలేదు. గతంలో హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు విధ్వంసం అయిన విశాఖపట్నం నవ నగరంగా ఆవిర్భవించింది.

అధునాతన సౌకర్యాలను కల్పించి విశాఖపట్నాన్ని తీర్చిదిద్దిన చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో కూడా గూగుల్ కు విశాఖపట్నంపై ఆసక్తి కలిగింది. వెరసి విశాఖపట్నం ఇప్పుడు అధునాతన డేటా సెంటర్ కాబోతున్నది.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్

Related posts

కేసీఆర్ పూజ గదిలో ఏముందో తెలిస్తే……

Satyam News

‘స్త్రీ శక్తి’ తో మహిళలకు ఆర్థిక చేయూత

Satyam News

తిరుమలపై దండయాత్రకు వస్తున్న జగన్

Satyam News

Leave a Comment

error: Content is protected !!