సోషల్ మీడియా సైట్లపై నిషేధం ప్రభుత్వం విధించినందుకు వ్యతిరేకంగా యువకులు చేపట్టిన ఆందోళనలపై పోలీసులు బలప్రయోగం చేయడంతో కనీసం 19 మంది మృతి చెందగా, 300 మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. సోమవారం నేపాల్ రాజధాని ఖాట్మండు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది.
విద్యార్థులు సహా వేలాది మంది యువకులు ఖాట్మండు లోని పార్లమెంట్ భవనం ముందు గుమికూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. నిషేధాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసనలు పోఖరా, బుట్వాల్, భైరహవ, భరత్పూర్, ఇటహరి, దమక్‌లకు విస్తరించాయి.
నేపాల్ పోలీసుల ప్రతినిధి బినోద్ ఘిమిరే ప్రకారం, ఖాట్మండు లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో 17 మంది మరణించగా, తూర్పు నేపాల్‌లోని సున్సారి జిల్లాలో పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు ప్రదర్శనకారులు మృతి చెందారు.
మంత్రి రాజీనామా
ప్రధాని కె.పి. శర్మ ఓలి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో భాగమైన నేపాలి కాంగ్రెస్ పార్టీకి చెందిన గృహశాఖ మంత్రి రమేశ్ లేఖక్ నైతిక కారణాలతో రాజీనామా చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రదర్శనలు హింసాత్మకంగా మారడంతో ఖాట్మండు లో సైన్యాన్ని మోహరించారు.
న్యూ బానేశ్వర్‌లోని పార్లమెంట్ సముదాయం చుట్టుపక్కల రహదారులపై ఆర్మీ నియంత్రణ తీసుకుంది. కొంతమంది ప్రదర్శనకారులు పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించడంతో పరిస్థితి ఉద్రిక్తమైపోయింది. దీంతో పోలీసులు వాటర్ కెనన్లు, టియర్ గ్యాస్‌తో పాటు తుపాకీ గుళ్లను కూడా ఉపయోగించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఖాట్మండు పోస్ట్ పత్రిక ప్రకారం, నేషనల్ ట్రామా సెంటర్‌లో ఎనిమిది మంది, ఎవరెస్ట్ ఆసుపత్రిలో ముగ్గురు, సివిల్ ఆసుపత్రిలో ముగ్గురు, ఖాట్మండు మెడికల్ కాలేజీలో ఇద్దరు, త్రిభువన్ టీచింగ్ ఆసుపత్రిలో ఒకరు మృతి చెందినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.
క్షతగాత్రులకు చికిత్స
ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశవ్యాప్తంగా ఆసుపత్రులు కనీసం 347 మంది గాయపడిన ప్రదర్శనకారులను చికిత్స చేస్తున్నారు. సివిల్ ఆసుపత్రిలో 100, ట్రామా సెంటర్‌లో 59, ఎవరెస్ట్‌లో 102, కేఎంసీలో 37, బీర్ ఆసుపత్రిలో 6, పటాన్ ఆసుపత్రిలో 4, త్రిభువన్ టీచింగ్ 18, నార్విక్ 3, బిపి కోయిరాలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 2, గండకి మెడికల్ కాలేజ్ 1, బీరత్ మెడికల్ కాలేజ్ 4, దమక్ ఆసుపత్రిలో 7 మందికి చికిత్స అందుతోంది.
హిమాలయన్ టైమ్స్ ప్రకారం, సివిల్ ఆసుపత్రి, ట్రామా సెంటర్‌లతో సహా పలు ఆసుపత్రులు రోగులను తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. దీంతో మరికొన్ని ఆసుపత్రులకు రిఫర్ చేయడం ప్రారంభించాయి. హింసాత్మక ఘటనల తర్వాత స్థానిక పరిపాలన రాజధానిలో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది.
ఖాట్మండు తో పాటు లలిత్‌పూర్ జిల్లా, పోఖరా, బుట్వాల్, సున్సారి జిల్లాలోని ఇటహరి ప్రాంతాల్లోనూ కర్ఫ్యూ జారీ చేశారు. ప్రభుత్వం గత గురువారం ఫేస్‌బుక్, వాట్సాప్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ సహా 26 సోషల్ మీడియా సైట్లను నిషేధించింది. ఇవి నిర్దిష్ట గడువులో కమ్యూనికేషన్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.
సోషల్ మీడియా సైట్లను నియంత్రణలోకి తెచ్చేందుకే ఈ నిషేధం విధించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ప్రజలలో ఇది స్వేచ్ఛా స్వరాలపై దాడిగా, భవిష్యత్తులో సెన్సార్‌షిప్‌కి దారితీయవచ్చన్న అభిప్రాయం పెరుగుతోంది. కంప్యూటర్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (CAN) ఒక ప్రకటనలో ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ వంటి ముఖ్యమైన ప్లాట్‌ఫారమ్‌లను ఒకేసారి మూసివేయడం విద్య, వ్యాపారం, కమ్యూనికేషన్, సాధారణ పౌరుల రోజువారీ జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చని పేర్కొంది.