ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడేళ్ల కాలానికి (01.09.2025 నుండి 31.08.2028 వరకు) ప్రకటించిన కొత్త బార్ పాలసీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో సాధారణ కేటగిరీ విభాగంలో 130 బార్లు, గీత కులాల వారికి ప్రత్యేకంగా 10 బార్లు కేటాయించడం జరిగింది. తొలి విడత నోటిఫికేషన్ లో భాగంగా ఓపెన్ కేటగిరీలో 69 బార్లు, గీత కులాలవారికి కేటాయించిన 10 బార్లు మొత్తం 79 బార్ల కేటాయింపు గతంలో పూర్తి అయ్యింది.
ఎన్టీఆర్ జిల్లాలో ఓపెన్ కేటగిరీలో మిగిలిపోయిన 61 బార్ల కేటాయింపునకు ఈ నెల 3వ తేదీన మళ్ళీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గడువు ముగిసే సమయానికి (17.09.2025) ఓపెన్ కేటగిరీలో ప్రకటించిన 61 బార్లకుగాను 7 బార్లకు మాత్రమే మొత్తం 28 దరఖాస్తులు వచ్చాయి. 54 బార్లకు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. వీటిలో నిబంధనల ప్రకారం కనీసం 4 దరఖాస్తులు వచ్చిన 7 బార్ల కేటాయింపు ప్రక్రియ ముందే ప్రకటించిన విధంగా గురువారం ఉదయం 8.00 గం. నుంచి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగింది.
జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి ఎస్.శ్రీనివాసరావు, దరఖాస్తుదారుల సమక్షంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ గారిచే లాటరీ విధానంలో పారదర్శకంగా బార్లు కేటాయించడం జరిగింది. రెండవ విడత నోటిఫికేషన్ ద్వారా బార్ల కేటాయింపు పూర్తయిన తరువాత ఇంకా 54 బార్లు దరఖాస్తులు రాని కారణంగా ఆగిపోయాయి.
తిరువూరు నగర పంచాయతీ పరిధిలో ఒక బారు, జగ్గయ్యపేట మున్సిపాలిటీ పరిధిలో ఒక బారు, కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆరు బార్లు మరియు విజయవాడ నగర పరిధిలోని 46 బార్లు మిగిలిపోయిన వాటిలో ఉన్నాయి. విజేతలైన దరఖాస్తుదారులు అందరూ నిర్ణయించిన సాంవత్సరిక లైసెన్సు ఫీజులో 6వ వంతు సొమ్ము ఈరోజు ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించాలి.