టిటిడి స్థానిక ఆలయాల్లో ఆగష్టు 16వ తేదీన శనివారం గోకులాష్టమి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా వున్న శ్రీకృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా ఉదయం శ్రీ కృష్ణస్వామివారి మూలవర్లకు అభిషేకం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు స్వామివారు పెద్దశేష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. తరువాత గోపూజ, గోకులాష్టమి ఆస్థానం జరుగనుంది.
అదేవిధంగా ఆగష్టు 17న ఉట్లోత్సవంను పురస్కరించుకొని స్వామి వారికి స్నపన తిరుమంజనం, ఊంజల్‌సేవను చేపడుతారు. సాయంత్రం ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా సాయంత్రం శ్రీ కృష్ణ స్వామివారికి అభిషేకం, పురాణ పఠణం, ఆస్థానం నిర్వహిస్తారు. నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం, శుద్ది నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీ కృష్ణ స్వామివారికి గోకులాష్టమి ఆస్థానం, నివేదన నిర్వహిస్తారు. ఆగష్టు 17వ తేదీ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాల, పంచాంగ శ్రవణం, శ్రీ కృష్ణస్వామివారి వీధి ఉత్సవం, సాయంత్రం గోపూజ, ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు.
కార్వేటినగరంలో…
కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి, శ్రీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, ప్రత్యేక అభిషేకం, తదుపరి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ఆస్థానం, నివేదన చేపడుతారు. ఆగష్టు 17వ తేదీన ఉట్లోత్సవం సందర్భంగా ఉదయం సుప్రభాతం, తోమల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఉత్సవర్లకు సమర్పణ, సాయంత్రం గోపూజ, ఉట్లోత్సవం , రాత్రి తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ రెండు రోజుల్లో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.