రూ.60.4 కోట్లు మోసానికి సంబంధించిన కేసులో బాలీవుడ్ నటులు బిపాషా బసు, నేహా ధూపియా, నిర్మాత ఏక్తా కపూర్‌లను ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం (EOW) విచారణకు పిలవబోవట్లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో వ్యాపారవేత్త రాజ్ కుంద్రా, ఆయన భార్య, నటి శిల్పా శెట్టి విచారణ ఎదుర్కొంటున్నారు.
విచారణలో భాగంగా కుంద్రా తెలిపిన వివరాల ప్రకారం, బెస్ట్ డీల్ టీవీ (Best Deal TV) అనే ఇప్పుడు మూతపడిన హోమ్ షాపింగ్, ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫారమ్‌కి సంబంధించిన ప్రమోషన్లు, హాజరుల కోసం ఈ ముగ్గురు సినీ ప్రముఖులకు ప్రొఫెషనల్ ఫీజులు చెల్లించారని చెప్పాడు. బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి పనిచేశారు.
ఈ సంస్థకే మోసపూరిత కార్యకలాపాల కేసు నమోదు అయింది. సెప్టెంబర్ 15న కుంద్రాను ఐదుగంటలకు పైగా EOW అధికారులు ప్రశ్నించారు. ఈ కేసు లోటస్ క్యాపిటల్ ఫైనాన్స్ సర్వీసెస్ డైరెక్టర్ దీపక్ కోఠారి ఫిర్యాదు మేరకు నమోదైంది. ఆయనను రూ.60.4 కోట్లు అప్పు-పెట్టుబడి ఒప్పందంలో మోసగించారని ఆరోపించారు. ఇప్పటి వరకు దర్యాప్తులో బిపాషా బసు, నేహా ధూపియా, ఏక్తా కపూర్ తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు.
అందువల్ల వారిని విచారణకు పిలవడం అవసరం లేదని తెలిపారు. కేసుకు సంబంధించి ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. రాజ్ కుంద్రా, శిల్పా శెట్టిలపై లుక్‌అవుట్ సర్క్యులర్లు (LOCs) జారీ చేసి, దేశం విడిచి వెళ్లకుండా ఆపారు. రాజ్ కుంద్రాను వచ్చే వారం మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.