పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ ను భారత్ గట్టి దెబ్బే కొట్టింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఇప్పటి వరకూ ధృవీకరించలేదు. ఈ విషయాలను ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఇప్పుడు వెల్లడించడంతో ప్రపంచం ఆశ్చర్యపోతున్నది. బెంగళూరులో శనివారం జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సిందూర్ నిర్వహించినట్లు. ఆయన మాటల్లో చెప్పాలంటే… అది చాలా హై-టెక్ యుద్ధం. కేవలం 80-90 గంటల్లోనే మా లక్ష్యాల్లో చాలావరకు సాధించాం.
యుద్ధం ఇలాగే కొనసాగితే భారీ మూల్యం తప్పదని పాకిస్తాన్ కు అర్థమైంది. అందుకే వాళ్లు కాళ్ల బేరానికి వచ్చారు. చర్చలు జరుపుదామని పాక్ నుంచి సందేశం వచ్చింది. అప్పుడు మేం దానికి అంగీకరించాం అని ఏపీ సింగ్ తెలిపారు. సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు చెందిన ఐదు ఫైటర్ జెట్లను, ఓ భారీ ఎయిక్రాఫ్ట్ ను మన సైన్యం కూల్చేసింది. మన సైన్యం దాడి చేసిన పాక్ ప్రధాన ఎయిర్ ఫీల్డ్ లలో షహబాజ్ ఐకోబాబాద్ స్థావరం ఒకటి. అక్కడ ఎఫ్-16 హ్యాంగర్ ఉంది.
మన సైన్యం దాడితో అది సగానికి పైగా దెబ్బతింది. అక్కడ కొన్ని యుద్ధ విమానాలు ఉన్నాయని, అవి తీవ్రంగా దెబ్బతిన్నాయని మేం అంచనాకు వచ్చాం. ఆపరేషన్ సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థ, ఎస్-400 క్షిపణి వ్యవస్థ సమర్థంగా పనిచేశాయి అని వివరించారాయన. పుల్వామా దాడికి ప్రతీకారంగా 2019లో భారత్ బాలాకోట్ వైమానిక దాడులు జరిపింది. ఆ సమయంలో ఉగ్రవాదుల్ని మట్టు పెట్టగలిగాం.
అయితే అప్పుడు శత్రు దేశానికి జరిగిన నష్టం గురించి ప్రజలకు వివరించలేకపోయాం. అది భారత వైమానిక దళాన్ని ఓ ఆత్మలా వెంటాడింది. అయితే ఆపరేషన్ సిందూర్ తో స్పష్టమైన సమాచారం ప్రజలకు చేరవేయగలిగాం. తద్వారా లోపాలను సవరించుకోగలిగాం. అలా బాలాకోట్ ఆత్మ శాంతించింది అని అన్నారాయన. ఆపరేషన్ సిందూర్ లో పాక్ వాయుసేన సామర్థ్యానికి జరిగిన నష్టంపై భారత్ ప్రకటన చేయడం ఇదే తొలిసారి.