ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికలను అత్యాధునిక S-3 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ సాయంతో ఎన్నికలు నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. ఈ ఈవీఎంలతో ఎన్నికల ప్రక్రియ మరింత సులభమవుతుందని చెప్పారు.
డిటాచబుల్ మెమరీ మాడ్యూల్ ద్వారా ఒకే యంత్రాన్ని 2,3 దశల్లో నిర్వహించే పోలింగ్‌కు వినియోగించుకోవచ్చని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆన్‌లైన్‌లో నామినేషన్ వేసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దామన్నారు నీలంసాహ్ని. ఆన్‌లైన్‌లో నామినేషన్ వేసినప్పటికీ సంబంధిత పత్రాలు ప్రింట్ తీసి వాటిపై సంతకాలు చేసి నిర్దేశిత గడువులోగా ఎన్నికల అధికారులకు అందజేయాలన్నారు.
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్‌లలో S-3 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్‌లను ఉపయోగించారు. అక్కడ ఎన్నికలను పరిశీలించిన తర్వాత ఏపీలో కూడా ఆ విధానం అమలు చేస్తే బాగుంటుందని .. నీలం సాహ్ని చెబుతున్నారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు పెడతానంటున్నారు.
ఐతే స్థానిక ఎన్నికలను EVMలతో నిర్వహించాలంటే..కొత్త EVMలు కొనుగోలు చేయాలి. ఆ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా ఉంటుంది. జనవరి లేదా ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటే సాధ్యం కాదు. అయినా నీలం సహాని ప్రయత్నిస్తానంటున్నారు.
నాలుగు దశల్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఈవీఎంలతో పోలింగ్ కు అంగీకరించే అవకాశాలు ఉండకపోవచ్చని చెబుతున్నారు. వైసీపీ కూడా ఈవీఎంలను అంగీకరించే అవకాశం లేదు. గతంలో తాము గెలిచినప్పుడు EVMలు అద్భుతమన్న వైసీపీ నేతలు..గత కొద్దిరోజులుగా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే వైసీపీ సర్కార్ నియమించిన SEC ఈ ప్రతిపాదన తెచ్చినప్పటికీ వారు అంగీకరించే అవకాశం ఉండదు.