ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే చందంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేసును సీబీఐకి అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అంతర్రాష్ట్ర సమస్యలతో పాటు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అంశం కాబట్టి విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడం సముచితం అని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రాజెక్ట్ రూపకల్పన, నిర్మాణం మరియు ఆర్థిక సహకారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఆర్థిక సంస్థలు కూడా పాల్గొన్నాయని ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 94 వేల కోట్ల ప్రాజెక్ట్. వడ్డీలు, పెరిగిన అంచనాల లెక్కలు చూస్తే లక్షా 40 వేల కోట్లు దాటింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం అవినీతిపై నియమించిన పిసి ఘోష్ కమిటీ కెసిఆర్ దే తప్పు అని తేల్చింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ దర్యాప్తును ప్రకటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు (కేటీఆర్) సోమవారం విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దర్యాప్తును సీబీఐకి అప్పగించడం తెలంగాణను ఎండబెట్టే కుట్ర అని ఆరోపించారు.
“ఇది కేవలం కేసీఆర్‌పై దాడి మాత్రమే కాదు, ప్రాజెక్ట్‌ను ఎండబెట్టి గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్‌కి మళ్లించే కుట్ర” అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు నిరసనలు చేపడతామని ఆయన ప్రకటించారు. దీని తరువాత పలు బీఆర్‌ఎస్ నాయకులు తెలంగాణలో వీధుల్లోకి వచ్చి నిరసనల్లో పాల్గొన్నారు.