మచిలీపట్నం నగరంలో రహదారి ప్రమాదాలు నివారించేందుకు గోశాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శనివారం ఉదయం నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రాష్ట్ర మంత్రి జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తో కలసి గోశాలను ప్రారంభించి గోమాతలకు పూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మచిలీపట్నం నగరంలో రహదారుల పై ఆవులు, గేదెలు ఉండటం వలన ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారన్నారు. చాలామంది ప్రమాదాలకు గురయ్యారన్నారు. ఒకవైపు పశువులకు గాయాలు అవడమే కాకుండా మరోవైపు మనుషులు కూడా ప్రమాదాలకు గురై దెబ్బలు తగిలి చనిపోవడం జరిగిందన్నారు.
అంతేకాకుండా ఆవులు, గేదెలు రహదారులపై ఉన్న ప్లాస్టిక్ కవర్లు తదితర పాడైపోయిన వస్తువులను తింటూ అనారోగ్యం పాలవుతున్నాయన్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందు కోసం పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సభ్యులతో మునిసిపల్, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలసి డి.ఎస్.పి నాయకత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు.
వారంతా కలిసికట్టుగా ముందుకు వచ్చి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆవులు, గేదలు కోసం ప్రత్యేకించి ఒక గోశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రహదారుల్లో ఉన్న ఆవులు, గేదెలను దూడలను అన్నింటిని తీసుకొని వచ్చి గోశాలలో ఉంచి వాటికి కావలసిన గడ్డి, దాణ ఏర్పాటు చేశారన్నారు.
ఇకపై యజమానులు బాధ్యత తీసుకొని ఎవరు కూడా రహదారులపై తమ ఆవులు, గేదెలను వదలరాదని, గోశాలకు తరలించాలని, గోశాల నిర్వహణకు అయ్యే ఖర్చులు వారే భరించాలన్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ నగరంలో ఆవులు గేదెలు రహదారులపై సంచరించడం వలన రాకపోకలకు చాలా ఇబ్బంది కలిగి ప్రమాదాలు జరిగాయన్నారు.
ఈ పరిస్థితులను గమనించిన మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని గోశాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ గోశాలలో 112 ఆవులు ఉన్నాయన్నారు. ఈ గోశాలలో ఆవులను ఉంచి వాటికి గడ్డి తదితర అవసరాల నిర్వహణ కోసం యజమానులు 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
గోశాల ఏర్పాటుతో ప్రజలకు ఇబ్బందులు తొలగిపోయాయన్నారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, కమిటీ సభ్యులు, డి.ఎస్.పి సిహెచ్ రాజా, మునిసిపల్ సహాయ కమిషనర్ గోపాలరావు, కార్పొరేటర్ అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ, మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.