ఏపీ ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని ప్రజలందరికీ రూ.25 లక్షల యూనివర్శల్ హెల్త్ బీమాను కల్పించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇది దేశంలోనే సంచలనాత్మక నిర్ణయం. ఐతే దీనిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తుంటే వైసీపీ మాత్రం బొక్కలు వెతికే ప్రయత్నం చేస్తోంది. ప్రధానంగా ఆ పార్టీ అధినేత ఓ సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో కంపెనీలు లాభాలు లేకుండా ఆ పాలసీలు ఇస్తాయా అంటూ పెద్ద స్క్రిప్ట్ చేశారు. కూటమి సర్కార్ తీసుకువచ్చిన రూ.25 లక్షల యూనివర్శల్ హెల్త్ ఇన్సూరెన్స్ వద్దంటున్నారు జగన్. ఆరోగ్య శ్రీనే బెటర్ అని చెప్పుకుంటున్నారు. ఇందుకు సాక్ష్యంగా గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో బెటర్‌గా అమలు చేశామని సాక్షి పత్రిక పేపర్ కటింగ్స్ చూపిస్తున్నారు.
ఇక మెడికల్ కాలేజీల విధానంపైనా జగన్ విమర్శలు గుప్పించేశారు. మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని..అయినవాళ్లకు ఇచ్చేస్తున్నారని కూడా ఆరోపణలు చేశారు. మెడికల్ కాలేజీల అంశంపై ఇటీవలి కేబినెట్ లో పబ్లిక్,ప్రైవేటు, పార్టనర్ షిప్‌లో నిర్వహణ చేపట్టాలని నిర్ణయించారు. దీంతో వైసీపీ నేతలంతా మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఇక జగన్ కూడా ఇదే విషయాన్ని తన ట్వీట్‌లో ప్రస్తావించారు.
ఇక వైసీపీ నేతల విమర్శలకు మంత్రి సత్యకుమార్ కౌంటర్ ఇచ్చారు. పీపీపీ అంటే ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని సంబంధిత మంత్రి సత్యకుమార్ సూచించారు. యాజమాన్యం ప్రభుత్వానిదేనని నిర్వహణలో మాత్రం ప్రైవేటు సహకారం ఉటుందని క్లారిటీ ఇచ్చారు. మెడికల్ కాలేజీల పేరుతో పెద్ద ఎత్తున అప్పులు చేసిన జగన్ సర్కార్ కనీసం బిల్డింగ్స్ కూడా పూర్తి చేయలేదన్నారు.
ఐతే వీటిపై నేరుగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడే అవకాశం జగన్‌కు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉంది. కానీ వైసీపీ నేతలు మాత్రం అసెంబ్లీకి వచ్చేందుకే భయపడుతున్నారు. బయట మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, అలా ఐతేనే అసెంబ్లీకి వస్తామని బీరాలకు పోతున్నారు. బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.