మహానగర పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది సుమారు 85 వేల విగ్రహాలు కొలువుదీరినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న గల్లీలు, అపార్ట్‌మెంట్స్, ఇతర చిన్న విగ్రహాలు కలుపుకొని లక్ష విగ్రహాలు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. వాటిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60 వేల విగ్రహాలు నమోదుకాగా, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్స్ పరిధిలో సుమారు 25 వేల విగ్రహాలు కొలువుదీరినట్లు అధికారులు వెల్లడించారు.
విగ్రహాలను సెక్టార్ల వారీగా లెక్కతీసి జియోట్యాగింగ్ చేస్తున్నారు. నిమజ్జనానికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు విగ్రహాల నిర్వాహకులతో మాట్లాడాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఇన్‌స్పెక్టర్లకు, సెక్టార్ ఎస్సైలకు దిశా నిర్దేశం చేశారు..