టారిఫ్ ల పేరుతో భారత ఆర్ధిక వ్యవస్థను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లాంటి వారు ఛిన్నాభిన్నం చేయాలని చూస్తున్నా కూడా భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం మేరకు రికార్డు స్థాయిలో వృద్ధి సాధించింది. గత ఐదు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి సాధించింది. ఈ వృద్ధి గణాంకాల తరువాతే అమెరికా విధించిన అంతరాయం కలిగించే సుంకాలు అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ డేటా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వ్యవసాయ రంగం బలమైన ప్రదర్శన కారణంగానే జీడీపీ వృద్ధి నమోదైంది.
భారత్ ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో వేగంగా పెరుగుతున్న దేశంగా కొనసాగుతుండగా, అదే కాలంలో చైనాకు 5.2 శాతం జీడీపీ వృద్ధి మాత్రమే నమోదైంది. గతంలో అత్యధిక వృద్ధి 2024 జనవరి-మార్చిలో 8.4 శాతంగా నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయరంగం 3.7 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.
ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో నమోదైన 1.5 శాతం కంటే ఎక్కువ. తయారీ రంగంలో వృద్ధి 7.6 శాతం నుండి స్వల్పంగా పెరిగి, 2025-26 తొలి త్రైమాసికంలో 7.7 శాతానికి చేరింది. ఇక, ఈ నెల ఆరంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడీపీ వృద్ధిని 6.5 శాతంగా అంచనా వేసింది. త్రైమాసికాల వారీగా చూస్తే Q1లో 6.5%, Q2లో 6.7%, Q3లో 6.6%, Q4లో 6.3% వృద్ధి సాధ్యమని అంచనా వేసింది.