కరీంనగర్ హోమ్

కారు పార్టీ స్మగ్లింగ్ లగ్జరీ కార్ల మీద నడుస్తోందా?

#BandiSainjai

లగ్జరీ కార్ల దిగుమతి, స్మగ్లింగ్, కస్టమ్స్ డ్యూటీ ఎగ్గొట్టడంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) శుక్రవారం ముమ్మర సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌కు చెందిన లగ్జరీ కార్ల డీలర్‌ బసరత్ ఖాన్‌ నివాసం, కార్యాలయం, అలాగే అతని స్నేహితుల ఇళ్లలోనూ అధికారులు దాడులు నిర్వహించారు.

జూబ్లిహిల్స్‌లోని అతని ఇల్లు, గచ్చిబౌలిలోని ఎస్కే కార్ లాంజ్‌పై ఈడీ జట్లు సోదాలు జరిపి పలు ముఖ్యమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటికే ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ (ఫెమా) ఉల్లంఘన కేసులో బసరత్ ఖాన్‌పై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తోంది. తాజాగా వెలుగులోకి వస్తున్న స్మగ్లింగ్ ఆరోపణలతో ఖాన్ వ్యవహారం మరింత తీవ్రతరం అయింది.

అమెరికా, జపాన్‌ల నుంచి దిగుమతి చేసిన లగ్జరీ కార్లను దుబాయ్, శ్రీలంక మీదుగా భారత్‌కు రప్పించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే ఎడమవైపు స్టీరింగ్ ఉన్న కార్లను కుడివైపు స్టీరింగ్‌లుగా మార్చి తప్పుడు డాక్యుమెంట్లతో విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కస్టమ్స్ మోసం కారణంగా ప్రభుత్వానికి సుమారు రూ.25 కోట్ల నష్టం వాటిల్లిందని డీఆర్ఐ అధికారులు ఇప్పటికే వెల్లడించారు.

దీనిపై ఈడీ ముమ్మరంగా ఆరా తీస్తూ, బసరత్ ఖాన్‌తో పాటు అతని వ్యాపార భాగస్వాములు, కొనుగోలుదారుల వివరాలు సేకరిస్తోంది. బసరత్ ఖాన్ నుంచి పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు లగ్జరీ కార్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌లో ఖాన్ స్మగ్లింగ్ చేసిన కార్లలో ఒకటి ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయంపై ఇటీవలే కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేస్తూ, “కార్ పార్టీ స్మగ్లింగ్ లగ్జరీ కార్ల మీద నడుస్తోందా?” అని ప్రశ్నించారు. అంతేకాకుండా, ఖాన్ కుటుంబానికి చెందిన కంపెనీ పేరుతోనే కేటీఆర్ వాహనం కొనుగోలు జరిగిందని ప్రస్తావించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు తక్షణమే స్పందిస్తూ, కేటీఆర్ సాధారణ వాహన కొనుగోలు ప్రక్రియలోనే ఆ కారు తీసుకున్నారని వివరణ ఇచ్చారు.

అయితే, అదే సమయంలో మరొక రాష్ట్ర మంత్రి వరకు ఖాన్ నుంచి కారు కొనుగోలు చేసిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. బండి సంజయ్ ట్వీట్‌లతో ఈ వ్యవహారం మరింత రగిలి, రెండు రోజులు కాకముందే ఈడీ సోదాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈడీ వర్గాల ప్రకారం, లగ్జరీ కార్ల స్మగ్లింగ్, టాక్స్ ఎగ్గొట్టడమే కాకుండా, ఖాన్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఏ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు ఈ నెట్‌వర్క్‌లో భాగమయ్యారు అన్నది వెలికితీయడం లక్ష్యంగా దర్యాప్తు కొనసాగుతోందని తెలుస్తోంది. బసరత్ ఖాన్ సోదాల ప్రభావం కేవలం వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా, రాజకీయ రంగంలోనూ పెద్ద కలకలం రేపే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Related posts

సరిహద్దు గ్రామాల్ని ముంచేసిన పాక్ పాలకులు

Satyam News

అమరావతి మీదుగా 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు

Satyam News

పాషాణాలను సైతం కరిగించిన కథ!

Satyam News

Leave a Comment

error: Content is protected !!