ముఖ్యంశాలు హోమ్

తిరుగుబాటు చేసి బలి అయిన కవిత

#KalvakuntlaKavita

తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించిన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తన కుమార్తె, ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేశారు.

ఈ నిర్ణయం బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల్లో విపరీతమైన చర్చలకు దారి తీస్తోంది. కవిత గత కొన్నిరోజులుగా పార్టీపై, అలాగే తన బంధువులైన మాజీ మంత్రి టి.హరిష్ రావు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశాన్ని ఎత్తిచూపుతూ, దీనిపై సీబీఐ విచారణ జరగాలని ఆమె బహిరంగంగా డిమాండ్ చేశారు.

అయితే ఆ తర్వాతి పరిణామాలలో తెలంగాణ లోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిజంగానే కాళేశ్వరం కేసును సీబీఐకి ఇచ్చింది. కాళేశ్వరం కేసును సీబీఐకి ఇచ్చిన వెంటనే కవిత మాట్లాడుతూ కేసీఆర్ పై తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణ జరుపుతుంటే పార్టీ ఎలాంటి నిరసనలు ఎందుకు తెలపడం లేదని ప్రశ్నించారు.

కేసీఆర్ పై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే రాష్ట్ర మొత్తం భగ్గుమనాలి కదా అని ఆమె ప్రశ్నించారు. అసలు హరీష్ రావు ఈ కుంభకోణానికి పాల్పడ్డారని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో పెద్ద వివాదానికి దారితీశాయి. పార్టీ శ్రేయస్సుకు విరుద్ధంగా పనిచేశారని ఆరోపణలతోనే కవితను సస్పెండ్ చేసినట్లు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

బీఆర్‌ఎస్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, “పార్టీకి నష్టం కలిగించే విధంగా, పార్టీ పట్ల విరుద్ధంగా పనిచేసినందుకు కవితను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తక్షణమే సస్పెండ్ చేశారు” అని పేర్కొన్నారు. పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించడం, పార్టీకి అపకీర్తి కలిగించే వ్యాఖ్యలు చేయడం ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.

కవిత గతంలో కూడా పలు సందర్భాల్లో పార్టీ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా 2019లో నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం పొందిన తర్వాత, ఆమె ప్రభావం క్రమంగా తగ్గిపోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని బహిరంగంగా ఎత్తి చూపడం, కుటుంబ సభ్యులపైనే అవినీతి ఆరోపణలు చేయడం బీఆర్‌ఎస్‌లో అంతర్గత విభేదాలను బయటపెట్టింది. ఈ సస్పెన్షన్ నిర్ణయం బీఆర్‌ఎస్‌లోనే కాకుండా తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. కుటుంబ సంబంధాలు, రాజకీయ ప్రయోజనాలు, పార్టీ అంతర్గత శక్తి పోరు అన్నీ కలగలిసి ఈ పరిణామానికి కారణమయ్యాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇకపై కవిత రాజకీయ భవిష్యత్తు ఏ దిశగా వెళ్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక బీఆర్‌ఎస్‌లో ఈ పరిణామం పార్టీ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేసీఆర్ స్వయంగా తన కుమార్తెపై కఠిన నిర్ణయం తీసుకోవడం పార్టీ క్రమశిక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను చూపుతుందని నేతలు అంటున్నారు. అయితే ఇది కుటుంబ విభేదాలను మరింత బహిరంగం చేసింది.

Related posts

పాక్ తో క్రికెట్ మ్యాచ్ బాయ్ కాట్

Satyam News

సానియా తో అర్జున్ టెండుల్కర్ ఎంగేజ్మెంట్

Satyam News

ఆటో డ్రైవర్ల పట్ల చంద్రబాబుకు ఈ అకస్మాత్తు ప్రేమ ఎందుకు?

Satyam News

Leave a Comment

error: Content is protected !!