ఒక వైపు ఆనందోత్సాహాలతో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటుంటే ఇంకో వైపు భారీ వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆందోల్ మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర పరిస్థితుల్లో అందరు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
మరి ముఖ్యంగా ఆందోల్ నియోజకవర్గం లోని పలు ప్రాంతాల్లో చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కాల్వ గట్లు తెగిపోతున్నాయి. ఎవరైతే చెరువు పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారో వారందరూ జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పనులు అయితే తప్పించి బయటికి వెళ్ళొద్దని కోరుతున్నాను అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో రహదారులపై నుంచి కూడా నీళ్లు పొంగిపొర్లుతున్నాయి. ప్రవాహం అకస్మాత్తుగా పెరిగే అవకాశాలు ఉన్నందున ఇటువంటి ప్రాంతాల్లో ప్రయాణానికి సాహసం చేయొద్దని విజ్ఞప్తిచేస్తున్నాను. అలాగే వివిధ మండలాల్లోని చెరువు కట్టలు, కొన్ని కాలువల కట్టలు కూడా తెగిపోయాయి.

అధికారులు వెంటనే వాటిని రిపేర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. కొన్ని వేల ఎకరాల పంట నష్టం జరుగుతున్నా కూడా అధికారులు కానీ స్థానిక మంత్రి దామోదర గాని పట్టించుకోకపోవడం దురదృష్టకరం. పుల్కల్ మండలంలో బస్వాపూర్, మిన్పూర్ ప్రాంతంలో సింగూర్ కుడికాల్వకు గండి పడి పది రోజులు గడుస్తున్నప్పటికీ వాటిని పూడ్చకపోవడం వల్ల కొన్ని వందల ఎకరాల వరి పంట నష్టం జరిగింది.
టేక్మాల్ లోని గుండు వాగు తో పాటు అనేక వాగులు పొంగడంతో పొలాలు మునిగిపోయి వరి నష్టం జరిగింది. రేగోడ్ మండలంలో జగిర్యాల చెరువు అలుగేళ్లి పొంగిపొర్లుతున్నది అయినా తూములు వధలకపోవడం తో బ్యాక్ వాటర్ వల్ల పంట వేసిన చెన్లు మునిగిపోతున్నాయి. అల్లదుర్గం గ్రామంలోని చెరువుకు గండి పడి నాలుగు రోజులవుతుంది అయిన దానికి వెంటనే మరమ్మతులు చేయకపోవడం వల్ల గ్రామానికి బయటి గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
పుల్కల్ మండలం బస్వాపూర్ చెరువులోకి వెళ్లే కాలువ ను మూసివేయడం వల్ల ఎడమకాల్వ తెగిపోయి ఆ నీరు వృధాగా పోతుంది అయినా అధికారులు ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టకపోవడం విచారకరం. ఇప్పటికైనా అధికారులు మంత్రిగారు స్పందించి తెగిపోయిన కాలువలకు మరమ్మత్తులు చేసి పంట నష్టాన్ని తగ్గించాలని కోరుతున్నాను.
నియోజకవర్గంలో ఇంతటి భీభత్సమైన పరిస్థితి వున్నా మంత్రి గారు స్పందించకపోవడం చూస్తుంటే మంత్రిగారు ఎంతటి అసమర్థులో అర్థం అవుతుంది. వాతావరణ పరిస్థితులను బేరీజు వేస్తూ అధికారులకు సూచనలు ఇస్తూ అప్రమత్తం చేయాల్సిన మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాను. ఈ ఆపత్కాలంలో ప్రజలకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని ఆందోల్ మాజీ ఎం ఎల్ ఏ క్రాంతి కిరణ్ అన్నారు.