వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మరో స్కామ్‌లో దొరికిపోయారు. ఐతే వైసీపీ అధినేత జగన్, ఇతర నేతలు లిక్కర్, మైనింగ్ లాంటి స్కాములతో వేల కోట్లు వెనకేసుకుంటే నాని మాత్రం చిన్న చిన్న స్కాములు చేసి ఇరుక్కుపోయారు. ఇప్పటికే రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న నానికి సంబంధించి తాజాగా మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది.
మచిలీపట్నంలోని రంగనాయకస్వామి ఆలయ భూములను పేర్ని నాని పక్కా పథకం ప్రకారం కారు చౌకగా హస్తగతం చేసుకున్నారు. 2007లో పేర్ని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రంగనాయక స్వామి ఆలయానికి ధూప దీప నైవేద్యాల కోసం భూముల అమ్మకం అంటూ నాటకానికి తెరతీశారు.
కావాలని విలువైన భూములను కారు చౌకగా కొట్టేసేందుకు పావులు కదిపారు. నాటి దేవాదాయ శాఖ అధికారుల సహకారంతో బైపాస్ రోడ్డులోని దేవుడి చెరువు వద్ద RS నంబరు 197లో ఉన్న 5.33 ఎకరాల ఆలయ భూముల అమ్మకానికి.. 29-03-2007న వేలం వేయించి మరీ తక్కువకు కొనుగోలు చేశారు. మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని ఈ దేవాలయ భూముల్లో నుంచే హైటెన్షన్ విద్యుత్తు లైను ఉండడంతో ఎవరైనా కొనుగోలు చేస్తే మళ్లీ వాటిని అమ్ముకోలేరంటూ పేర్ని వర్గం అప్పట్లో ప్రచారం చేసింది.
దీంతో వేలంలో బయటి వాళ్లు ఎవరూ పాల్గొనలేదు. పేర్ని అనుచరులే రూ.2 లక్షల చొప్పున ధరావతు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. ఆ భూములకు మార్కెట్ ధర అప్పట్లోనే గజం రూ.5-8 వేల మధ్యలో ఉండగా.. అత్యంత చౌకగా.. గజం రూ.1,030-1,200 చొప్పున వేలంలో పాడుకుని హస్తగతం చేసుకున్నారు. ప్రస్తుతం అక్కడ గజం రూ.40-50 వేలు పలుకుతోంది.
పేర్ని నాని అనుచరుడు, వైసీపీ నేత మేక వీర వెంకట సుబ్బారావు, మరో ఇద్దరి పేరుతో 1.33 ఎకరాలు, ఎస్.మధుసూదనరావు, మరో ఇద్దరి పేరుతో రెండెకరాలు, లింగం వెంకటరమణమూర్తి, మరో ఇద్దరి పేరుతో 2 ఎకరాల చొప్పున మొత్తం 5.33 ఎకరాల భూమిని రూ.2.80 కోట్లకు కొనుగోలు చేశారు.
2007లో కొంత నగదు చెల్లించి, మిగిలిన సొమ్మును నాలుగేళ్ల తరువాత 2011లో ఎలాంటి వడ్డీ లేకుండా అందరూ కలిపి ఒకేరోజు చెల్లించారు. తెరవెనుక ఉన్న బడా నేతే ఆ డబ్బులను వారి పేరుతో కట్టారనే ఆరోపణలున్నాయి. లింగం వెంకటరమణమూర్తి పేరుతో కొనుగోలు చేసిన వెయ్యి గజాల భూమిలో 500 గజాలను..పేర్ని నాని భార్య జయసుధ, మామ పట్టపు రామచంద్రరావు పేర్లతో చెరో 250 గజాల చొప్పున గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2022 డిసెంబరు 12న రిజిస్ట్రేషన్ చేయించారు.
మళ్లీ 2023 మార్చిలో వారిద్దరి పేరిటే మిగిలిన 500 గజాలను కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మిగతా అనుచరుల పేరుతో ఉన్న స్థలాన్ని కూడా త్వరలో రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
ఈ భూములను వీళ్లు కొనుగోలు చేసిన తర్వాత.. వాటి మధ్యలో నుంచి వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్తు లైనును.. పేర్ని మంత్రిగా ఉన్న సమయంలో వైకాపా ప్రభుత్వ హయాంలో 2020లో బైపాస్ రోడ్డు విస్తరణ పేరుతో పక్కకు జరిపించారు.బైపాస్ పనులకు, ఈ ప్రైవేటు భూముల్లోని హెటెన్షన్ విద్యుత్తు లైన్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయినా.. బైపాస్ పేరుతో ప్రభుత్వ నిధులతోనే లైన్‌ను మార్పించుకున్నారు.