ఉక్రెయిన్ యుద్ధంలో పంజాబ్, హర్యానా యువకులను బలవంతంగా తీసుకువెళ్లి రష్యా వినియోగిస్తున్నదనే ఆరోపణలు రోజు రోజుకు బలంగా వినిపిస్తున్నాయి. అక్కడ ఇరుక్కుపోయిన వారి కుటుంబాలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించాయి.
అక్రమంగా వారి పిల్లలను “మరణ భూమి”కి పంపుతున్న దళారులు, ట్రావెల్ ఏజెంట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని వారు ఆరోపించారు. జూన్ నుండి ఇప్పటివరకు కనీసం 15మంది పంజాబ్ యువకులను ఉద్యోగాల పేరుతో రష్యాకు పంపించి, అక్కడ సైన్యంలో బలవంతంగా చేర్చారని సమాచారం.
భారత్ చెప్పినా వినిపించుకోని రష్యా
హర్యానాలోని ఫతేహాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు ఉక్రెయిన్‌లో ఇరుక్కుపోయి, తాము రష్యా సైన్యంలో చేర్చబడ్డామని చెప్పుతూ ఇటీవల ఓ వీడియో విడుదల చేశారు. భారత్ పలుమార్లు మాస్కోను తన పౌరులను యుద్ధంలో చేర్చవద్దని కోరినా పరిస్థితి మారలేదని తాజా సంఘటనలు వెల్లడిస్తున్నాయి.
పంజాబ్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇరుక్కుపోయిన యువకుల బంధువులు ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్గట్ సింగ్‌తో కలిసి చండీగఢ్ చేరుకున్నారు. జలంధర్ జిల్లా గొరయాకు చెందిన జగ్‌దీప్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం తన సోదరుడు మన్‌దీప్ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయాడు. ఇటీవలే ఐదుగురు యువకులు మరణించారని, ముగ్గురు అదృశ్యమయ్యారని సమాచారం.
పరిహారం కూడా దోచుకుంటున్న ట్రావెల్ ఏజెంట్లు
రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి యువకులు అత్యవసర కాల్స్ చేస్తున్నా పెద్దగా స్పందన రాలేదు అని ఆయన తెలిపారు. మలేర్‌కోట్లాకు చెందిన గుర్‌మెల్ సింగ్ మాట్లాడుతూ తన కుమారుడు అదృశ్యమైయ్యాడని తెలిపారు. అమృతసర్‌కు చెందిన పర్మీందర్ కౌర్ తన భర్త జగ్‌దీప్ సింగ్ యుద్ధంలో మరణించాడని చెప్పారు. మరణించిన లేదా అదృశ్యమైన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారం, పెన్షన్‌లను కూడా ట్రావెల్ ఏజెంట్లు దోచుకుంటున్నారని వారు ఆరోపించారు.
ఈ పరిస్థితిని పర్గట్ సింగ్ “వ్యవస్థ వైఫల్యం”గా పేర్కొన్నారు. “పంజాబ్ పోలీసులకు ఈ ఏజెంట్లను పట్టుకోవడంలో సామర్థ్యం లేకపోవడం అత్యంత విచారకరం. ఈ అంశాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లినా ఫలితం లేదు. ఇవి నిర్లక్ష్యం వహించాల్సిన ఫిర్యాదులు కావని ఆయన అన్నారు. ఇది అధికారికంగా నడుస్తున్న ఒక అక్రమ రవాణా రాకెట్ అని తెలిపారు.
కానీ భారత అధికార యంత్రాంగం దానిని గుర్తించడంలోనూ, అరికట్టడంలోనూ విఫలమైంది అని ఆయన అన్నారు. ఇరుక్కుపోయిన యువకుల విడుదల, స్వదేశానికి రప్పించడానికి రష్యా అధికారులతో నేరుగా అత్యున్నత స్థాయి దౌత్య చర్చలు జరపాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
“ట్రావెల్ ఏజెంట్లు, ఈ నేరానికి పాల్పడిన వారిపై మానవ అక్రమ రవాణా చట్టాల కింద తక్షణమే కేసులు నమోదు చేయాలి. బాధిత కుటుంబాలకు పరిహారం వెంటనే అందించాలి. ఈ దోపిడీకి చెక్ పెట్టేందుకు సంయుక్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి” అని ఆయన అన్నారు.