లండన్ లో మరొక జాత్యహంకార నేరం బయటకు వచ్చింది. ఓల్డ్బరీలోని ఒక పార్కులో నడచి వెళుతున్న ఒక సిక్కు మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. జాతి ద్వేషంతో ప్రతీకారేచ్ఛతో వారు ఈ నేరానికి పాల్పడ్డారు. ఎందుకంటే దాడి సమయంలో నిందితులు బాధితురాలిని “నీ దేశానికి తిరిగి వెళ్లిపో” అంటూ అవమానపరిచారని సమాచారం.
వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసు అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సెప్టెంబర్ 9, మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఈ దారుణ అత్యాచారం జరిగింది. నిందితులు ఇద్దరూ శ్వేతజాతి వ్యక్తులు. వారిలో ఒకరు బలంగా కాయంతో, తల గుండు చేసి, నలుపు రంగు స్వెట్ట్షర్ట్, గ్లౌజ్ ధరించి ఉండగా, మరొకరు వెండి జిప్ ఉన్న గ్రే టాప్ వేసుకున్నారని సాక్షులు తెలిపారు.
టేమ్ రోడ్ సమీపంలోని ఒంటరి ప్రదేశంలో జరిగిన ఈ ఘటన స్థానిక సిక్కు మతస్థులలలో భయాందోళనలను, ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇది లక్ష్యంగా చేసుకున్న ద్వేష నేరమై ఉండొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సాండ్‌వెల్ పోలీస్‌కి చెందిన చీఫ్ సూపరింటెండెంట్ కిమ్ మాడిల్ మాట్లాడుతూ, “ఈ ఘటన స్థానికులకు కలిగించిన బాధ, భయాన్ని మేము బాగా అర్థం చేసుకుంటున్నాం.
నిందితులను గుర్తించి పట్టుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం. ఫోరెన్సిక్, సీసీటీవీ దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ప్రజలకు నమ్మకం కలిగించేలా అదనపు పహారా బృందాలను మోహరించాం” అని తెలిపారు. అదే రోజున మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో సమీపంలోని వెస్ట్ బ్రోమ్‌విచ్‌లోని కెన్‌రిక్ పార్కులో మరో అత్యాచార ప్రయత్నం జరిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి.
ఈ రెండు ఘటనలకు సంబంధం ఉందో లేదో స్పష్టత రాలేదని పోలీసులు తెలిపారు. “ఈ సంఘటనలపై ఏవైనా సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలి” అని వెస్ట్ మిడ్‌లాండ్స్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.