తొక్కిసలాట కారణంగా 40 మంది మృతి చెందిన సంఘటనపై సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే పార్టీ మద్రాసు హైకోర్టును అర్థించింది.
నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే పార్టీ సెప్టెంబర్ 27న కరూరులో నిర్వహించినన సభలో తొక్కిసలాట జరిగి 40 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. టీవీకే న్యాయవాదుల విభాగం అధ్యక్షుడు ఎస్.అరివగన్ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం గ్రీన్‌వేస్ రోడ్‌లో ఉన్న న్యాయమూర్తి ధనపాణి నివాసానికి వెళ్లి ఈ విజ్ఞప్తి చేసింది. లేకపోతే కోర్టు స్వయంగా సుమోటో చర్యలు తీసుకోవాలని కూడా కోరింది.
టీవీకే నేతృత్వంలోని సభ నిర్వాహకుడు నిర్మల్ కుమార్ తెలిపిన ప్రకారం, న్యాయమూర్తి న్యాయవాదులను మదురై బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేయాలని సూచించగా, సోమవారం మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణకు తీసుకుంటామని తెలిపారు. ఇక తొక్కిసలాటలో గాయపడ్డ ఓ వ్యక్తి కూడా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
శనివారం జరిగిన ప్రాణాంతక ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు పూర్తయ్యే వరకు, బాధ్యతలు నిర్ణయించే వరకు, భద్రతా చర్యలు అమల్లోకి వచ్చే వరకు పార్టీ నేత విజయ్ తరఫున ఎలాంటి సభలు, ర్యాలీలు, రాజకీయ సమావేశాలకు అనుమతి ఇవ్వవద్దని తమిళనాడు డీజీపీకి ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరాడు.
పిటిషనర్ సెంథిల్‌కన్నన్ తనను టీవీకే ఇప్పటికే వేసిన పిటిషన్‌లో పార్టీలలో ఒకరిగా చేర్చాలని కూడా కోర్టును అభ్యర్థించాడు. ఆ పిటిషన్‌లో విజయ్ నేతృత్వంలోని పార్టీకి సెప్టెంబర్ 20 నుండి డిసెంబర్ 20, 2025 వరకు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రచారాలు నిర్వహించేందుకు అనుమతులు ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు ఇవ్వమని కోరుతూ టీవీకే దాఖలు చేసింది.