ఏపీలో కూటమి సర్కార్ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించే స్త్రీశక్తి పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో స్త్రీ పథకం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లను కూడా ఆదుకునేందుకు తాజాగా సీఎం చంద్రబాబు అనంతపురంలో వాహన మిత్ర పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏటా 15 వేల రూపాయల చొప్పున ఇవ్వబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఈ పథకం అక్టోబర్ 1 నుంచి అమలు కావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చే 15 వేల రూపాయల వాహన మిత్ర పథకం కోసం 16 షరతులు(మార్గదర్శకాలు) విడుదల చేసింది. ఈ అర్హతలు అన్నీ ఉంటేనే ఆటో డ్రైవర్లకు ఏటా 15 వేల రూపాయల సాయం అందనుంది. కాబట్టి ఆటో డ్రైవర్లు త్వరలో ప్రారంభమయ్యే ఈ పథకం దరఖాస్తులకు ఆయా అర్హతలు చెక్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వారి ఖాతాల్లో అక్టోబర్ 1న ఈ డబ్పులు జమ అవుతాయి.
ప్రభుత్వం వాహన మిత్ర పథకం కోసం ప్రకటించిన మార్గదర్శకాల్లో దరఖాస్తుదారులు ఆగస్టు 31 కల్లా కచ్చితంగా సొంత ఆటో, మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు తప్పనిసరిగా ఆటో లేదా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. దరఖాస్తుదారుల వాహనం ఏపీలో రిజిస్టర్ అయి ఉండటంతో పాటు ఫిట్ నెస్, పన్ను కూడా ఇక్కడే చెల్లిస్తూ ఉండాలి. ఆటోలకు మాత్రం ఈ ఏడాది ఫిట్ నెస్ సర్టిఫికెట్ మినహాయించారు. కానీ నెలలో వారు కూడా ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి.
వాహన మిత్రకు దరఖాస్తు చేసుకునే వారికి కేవలం ప్రయాణికుల్ని తిప్పే ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ ఉండాలి. గూడ్స్ వాహనాలకు ఈ పథకం వర్తించదు. ఆధార్ కార్డు, రైస్ కార్డు(రేషన్ కార్డు) తప్పనిసరిగా ఉండాలి. ఇంటికి ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది. సచివాలయాల్లో ఆన్ లైన్ లోనే ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు ఇతర పథకాల లబ్దిదారులు అయి ఉండకూడదు. అలాగే దరఖాస్తుదారు లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్లు అయి ఉండరాదు. శానిటరీ వర్కర్లకు మాత్రం ఇందులో మినహాయింపు ఇచ్చారు.
దరఖాస్తు దారు ఆదాయపు పన్ను చెల్లింపు దారు అయి ఉండకూడదు. దరఖాస్తు దారు ఇంటి నెలలవారీ కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటకూడదు. 3 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట భూమి లేదా రెండూ కలిపి 10ఎకరాలకు మించి ఉండకూడదు. మున్సిపల్ ప్రాంతాల్లో దరఖాస్తుదారుకు 1000 చదరపు గజాల్లో ఇంటి స్దలం లేదా వాణిజ్య స్థలం ఉండకూడదు. ఏదైనా సంస్థలకు లీజుకు నడుపుతున్న వాహనాలకు కూడా ఈ పథకం వర్తించదు. వాహనాలపై ఎలాంటి పెండింగ్ చలాన్లు, బకాయిలు ఉండకూడదు.