జాతీయం హోమ్

లడఖ్ లో మళ్లీ హింస: నలుగురు మృతి

#LehViolence

లడఖ్ లోని లేహ్‌ లోయలో బుధవారం చోటుచేసుకున్న విస్తృత ఘర్షణలలో నలుగురు మృతి చెందగా, 80 మందికి పైగా గాయపడ్డారు. దాంతో గురువారం పోలీసులు కర్ఫ్యూ కఠినంగా అమలు చేస్తున్నారు. కనీసం 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర హోదా, లడఖ్‌కు ఆరో షెడ్యూల్ అమలు చేయడం తదితర అంశాలపై కేంద్రంతో చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి లేహ్ ఏపెక్స్ బాడీ (LAB) అభ్యంతరం చెప్పింది.

కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా లేహ్ ఏపెక్స్ బాడీ పిలుపు మేరకు నిర్వహించిన బంద్, బుధవారం హింసాత్మకంగా మారి గృహదహనాలకు, వీధి ఘర్షణలకు దారితీసింది. క్లైమేట్ యాక్టివిస్ట్ సోనం వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతుగా కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్ (KDA) బంద్‌కు పిలుపునివ్వడంతో, కార్గిల్ సహా ఇతర ప్రధాన పట్టణాల్లో ఐదుగురికి మించిన సమూహాలపై నిషేధాజ్ఞలు అమలు అయ్యాయి.

లేహ్‌లో తీవ్ర ఘర్షణలు చెలరేగిన తర్వాత వాంగ్‌చుక్ తన రెండు వారాల నిరాహార దీక్షను ముగించారు. ఆందోళనకారులు బీజేపీ కార్యాలయాన్ని, అనేక వాహనాలను తగలబెట్టడంతో పాటు హిల్ కౌన్సిల్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. దీంతో పట్టణంలో కర్ఫ్యూ ప్రకటించాల్సి వచ్చింది. “కర్ఫ్యూ విధించిన ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. ఎక్కడా కొత్తగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు,” అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

హింసలో పాల్గొన్నందుకు సుమారు 50 మందిని రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నట్టు ఆయన చెప్పారు. గాయపడిన వారిలో ముగ్గురు నేపాల్ పౌరులు ఉన్నారని, ఈ హింస వెనుక విదేశీ ప్రమేయం ఉందేమోనని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ అమలు కోసం LAB, KDA ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.

వీటి కోసం కేంద్ర ప్రభుత్వంతో అనేక రౌండ్ల చర్చలు జరిగాయి. వచ్చే రౌండ్ అక్టోబర్ 6న జరగనుంది. కార్గిల్, జంస్కర్, నుబ్రా, పడం, చాంగ్‌థాంగ్, ద్రాస్, లమయురులో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కార్గిల్ జిల్లా మేజిస్ట్రేట్ రాకేష్ కుమార్ మొత్తం జిల్లాలో భారతీయ నగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఐదుగురికి మించి చేరడం, ర్యాలీలు, నిరసనలు నిషేధించారు.

అధికార అనుమతి లేకుండా మైకులు, వాహనాలపై పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ వాడకాన్ని కూడా నిషేధించారు. అదేవిధంగా ప్రజా శాంతిని భంగం కలిగించే, శత్రుత్వాన్ని రెచ్చగొట్టే, చట్టం-సువ్యవస్థను భంగం చేసే ప్రసంగాలు, ప్రకటనలు రాతపూర్వకంగా గాని, మౌఖికంగాని, ఎలక్ట్రానిక్ పద్ధతులలో గాని చేయరాదని ఆదేశంలో పేర్కొన్నారు.

సెప్టెంబర్ 10 నుండి 35 రోజులుగా కొనసాగుతున్న నిరాహార దీక్షలో ఉన్న 15 మందిలో ఇద్దరిని మంగళవారం సాయంత్రం ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తరలించగా, LAB యువజన విభాగం నిరసనకు పిలుపునిచ్చింది. ఈ హింసకు యాక్టివిస్ట్ వాంగ్‌చుక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కారణమని కేంద్రం ఆరోపించింది. ప్రభుత్వ ప్రతినిధులు, లడఖీ గ్రూపుల మధ్య జరుగుతున్న చర్చల పురోగతితో సంతోషించని కొందరు రాజకీయ ఉద్దేశాలున్న వ్యక్తులు ఈ హింస వెనుక ఉన్నారని తెలిపింది.

“లడఖ్ ప్రజల ఆశయాలను తీర్చేందుకు,న రాజ్యాంగ పరిరక్షణ అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది,” అని హోంశాఖ బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది.ఈ సంఘటనలు హృదయ విదారకమని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ శాంతియుతంగా తన అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ఉందని, కానీ జరిగినది సహజసిద్ధంగా జరగలేదని, అది కుట్ర ఫలితమని లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా పేర్కొన్నారు.

“మరింత ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త చర్యగా కర్ఫ్యూ విధించాం,” అని గుప్తా అన్నారు. ఆన్‌లైన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వాంగ్‌చుక్ మాట్లాడుతూ, 72 ఏళ్ల త్సెరింగ్ అంగ్‌చుక్, 60 ఏళ్ల తాషి దోల్మా లను ఆసుపత్రికి తరలించబడటం నిరసనలకు తక్షణ ప్రేరణ అయ్యిందని చెప్పారు. పరిస్థితి మరింత దిగజారుతుండడంతో, ఆయన యువతను హింస ఆపాలని విజ్ఞప్తి చేస్తూ తన నిరాహార దీక్షను విరమిస్తున్నట్టు ప్రకటించారు.

“లడఖ్ యువత హింసను తక్షణం ఆపాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే అది మన లక్ష్యానికి నష్టం కలిగిస్తుంది, పరిస్థితిని మరింత విషమం చేస్తుంది. మనకు లడఖ్, దేశంలో అస్థిరత అవసరం లేదు,” అని తన అనుచరులకు ఆయన విజ్ఞప్తి చేశారు. “ఇది లడఖ్‌కి, నాకు వ్యక్తిగతంగా అత్యంత దురదినం. ఎందుకంటే గత ఐదేళ్లుగా మనం శాంతియుత మార్గంలోనే నడిచాం… ఐదు సార్లు నిరాహార దీక్షలు చేశాం, లేహ్‌ నుండి ఢిల్లీకి నడిచి వెళ్లాం. కానీ నేడు మన శాంతి సందేశం విఫలమైందని, హింస, అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయని చూడాల్సి వస్తోంది,” అని వాంగ్‌చుక్ అన్నారు.

Related posts

ఓపెన్‌ఏఐ భారత్‌లో తొలి కార్యాలయం ఏర్పాటు

Satyam News

విజయనగరం లో మోడీ ఫ్లెక్సీ తొలగింపు

Satyam News

మన అవయవాలు కాపాడుకోవడం ఎలా?

Satyam News

Leave a Comment

error: Content is protected !!