రంగారెడ్డి హోమ్

‘హైడ్రా’ విలువ ఇప్పటికైనా తెలుసుకోండి

#RevanthReddy

హైదరాబాద్ అంబర్‌పేట్‌లో పునరుద్ధరించిన బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. చెరువులో బతుకమ్మలు వదిలి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఆడబిడ్డలను మన సంతోషంలో భాగస్వాములను చేసినప్పుడే బతుకమ్మ పండుగ నిండుదనం పొందుతుందని సీఎం వ్యాఖ్యానించారు.

బతుకమ్మ కుంట ఏర్పాటుకు జీవితాంతం కృషి చేసిన వి. హనుమంతరావు గారి త్యాగాన్ని గుర్తుచేసుకున్నారు. హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు కొంతమందికి అర్థం కాలేదని, కొందరు తమ కబ్జాలను కాపాడుకోవడానికి అడ్డంకులు సృష్టించారని, విమర్శలు ఎదురైనా సమయస్ఫూర్తితో సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగామన్నారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను ప్రస్తావిస్తూ రెండు సెంటీమీటర్ల వర్షానికే సరిపడేలా మన వ్యవస్థలు ఉన్నప్పటికీ, ఇప్పుడు ఒకేసారి కుంభవృష్టి కురుస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనకు ముందస్తు ప్రణాళికలు రూపొందించామని స్పష్టం చేశారు.

ఒకప్పుడు జీవధారగా ఉన్న మూసీ ఇప్పుడు మురికి కూపంగా మారిందని, చెరువులను విడిపించడం, నాలాలను విస్తరించడం, మూసీ పునరుజ్జీవనం చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

పేదరికం విలువ తనకు తెలుసని, వర్షం వస్తే గంటలోనే మూసీ పరివాహక కాలనీలు జలమయం అవుతున్నాయని, భవిష్యత్‌లో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నగరాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంబర్‌పేట్ పరివాహక ప్రాంతాల పేదలకు పునరావాసం కల్పించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ప్రజలకు హెచ్చరిక చేస్తూ మహానగరంలో మాయగాళ్లు చాలామంది ఉంటారని, వారు ప్రభుత్వ భూములు అమ్మితే కొనొద్దని, మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, పేదలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సూచన మేరకు బతుకమ్మ కుంటకు వి. హనుమంతరావు పేరు పెట్టాలని ఆదేశించారు.

ఆనాడు ఆయన సూచనతోనే ప్రగతి భవన్ పేరు జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మార్చామని, ఆయన గౌరవానికి భంగం కలగకుండా సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తామని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, పర్యావరణ పరిరక్షణతో పాటు పేదలకు సదుపాయాలు కల్పిస్తూ భవిష్యత్ తరాలకు అనుకూలమైన మహానగరంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

Related posts

ఆరబెట్టి, గ్రేడింగ్ చేసిన ఉల్లికి రూ.12 గ్యారెంటీ

Satyam News

రేపటి నుండి భాద్రపద మాసం ప్రారంభం

Satyam News

స్కూల్లో నే డ్రగ్స్ తయారీ

Satyam News

Leave a Comment

error: Content is protected !!