పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ ఖ్వా రాష్ట్రంలో సంభవించిన అకస్మాత్తు వరదల కారణంగా మరణాల సంఖ్య శనివారం నాటికి 327కి పెరిగింది. ముఖ్యంగా బునేర్ జిల్లాలో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (PDMA) వెల్లడించింది. గిల్గిత్-బాల్టిస్తాన్‌లో 12మంది, ఆజాద్ జమ్మూ కాశ్మీర్‌లో 9మంది మరణించడంతో పాటు విస్తృత స్థాయిలో నష్టాన్ని కలిగించాయి.
భారీ వర్షాలు, మేఘ విస్ఫోటనాల కారణంగా అనేక జిల్లాల్లో అకస్మాత్తు వరదలు సంభవించి, ఒక్క రోజులోనే 200 మందికి పైగా మృతి చెందారు. వీరిలో మోహ్మండ్ జిల్లాలో సహాయక చర్యలలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురు సిబ్బంది కూడా ఉన్నారు. కేపీ రాష్ట్రంలో బునేర్ అత్యంత తీవ్రంగా ప్రభావితమై, గత 48 గంటల్లో 204 మంది మృతిచెందారని PDMA పరిస్థితి నివేదిక తెలిపింది.
అదనంగా 120 మంది గాయపడ్డారని, 50 మంది అదృశ్యమయ్యారని డిప్యూటీ కమిషనర్ కాషిఫ్ ఖయ్యూం ఖాన్ కార్యాలయం తెలిపింది. PDMA నివేదిక ప్రకారం, శనివారం ఉదయం వరకు శాంగ్లా 36, మన్సెహ్రా 23, స్వాత్ 22, బజౌర్ 21, బట్టాగ్రామ్ 15, లోయర్ డిర్ 5 మరణాలు సంభవించాయి. అబ్బొటాబాద్‌లో ఒక చిన్నారి మునిగి చనిపోయాడు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నష్టానికి సంబంధించి, 11 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, 63 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
స్వాత్‌లో రెండు పాఠశాలలు, శాంగ్లాలో ఒక పాఠశాల నష్టపోయింది. కేపీ ప్రభుత్వం బునేర్, బజౌర్, స్వాత్, శాంగ్లా, మన్సెహ్రా, టోర్‌ఘర్, అప్‌పర్ & లోయర్ డిర్, బట్టాగ్రామ్ జిల్లాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆగస్టు 31 వరకు ఈ అత్యవసర పరిస్థితి అమల్లో ఉంటుందని, స్థానిక పరిపాలన అన్ని వనరులను సహాయక చర్యలకు వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్ వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించనున్నారు. బాధితులను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలు వింటారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తన ప్రకటనలో, “కేపీ మరియు ఉత్తర పాకిస్తాన్‌లో మేఘ విస్ఫోటనాలు, అకస్మాత్తు వరదలు కలిగించిన విధ్వంసం నన్ను తీవ్రంగా కలచివేసింది” అన్నారు. బాధితులకు సానుభూతి తెలుపుతూ, ప్రభుత్వం రక్షణ, సహాయక చర్యల కోసం అన్ని వనరులను వినియోగిస్తోందని ఆయన తెలిపారు.