మంగళగిరికి మహర్దశ మొదలైంది. మంగళగిరిని సౌత్ ఇండియా గోల్డ్ హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మంత్రి నారా లోకేష్. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు, స్థానిక చేతివృత్తిదారులకు మంచి నైపుణ్యాన్ని జోడించేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఇందుకోసం భూమిని సిద్ధం చేయాలని CRDA తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జెమ్స్ అండ్ జువెల్లరీ పార్కును దేశంలోనే అత్యుత్తమ నమూనాగా నిర్మించేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ పార్క్‌తో స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇక యువతకు ట్రైనింగ్, ఉద్యోగాలు, కెరీర్ గైడెన్స్ కోసం మోడల్ కెరీర్ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
మొత్తం 75 ఎకరాల విస్తీర్ణంలో ఆభరణాల తయారీలో ఆధునిక శిక్షణ , డిజైన్ ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేయాలన్నది ప్లాన్.ఈ ఇనిస్టిట్యూట్‌ల ద్వారా బంగారు చేతివృత్తిదారులకు అధునాతన సాంకేతికతలు, డిజైన్ నైపుణ్యాలను అందిస్తాయి. కామన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా సంవత్సరానికి 4,000 మందికి ఆభరణాల తయారీలో అధునాతన శిక్షణ అందించే లక్ష్యం పెట్టుకున్నారు. ఈ పార్క్‌లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం ద్వారా, ఆభరణాల రంగంలో పరిశోధన, అభివృద్ధి, సరికొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వనున్నారు.
ఇక,ఈ పార్క్ బెస్ట్ రీటైల్ మార్కెట్ గా ఉండాలని భావిస్తున్నారు లోకేష్. దేశంలోని టాప్ 20 ఆభరణాల తయారీ సంస్థలను ఈ పార్క్‌లో తమ తయారీ యూనిట్లు , రిటైల్ షాపులు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, మంగళగిరి జువెల్లరీ సెంటర్‌గా మారనుంది. ఇప్పటికే స్థానికంగా చేనేతకు అనేక ప్రోత్సహాకాలు అందించారు లోకేష్. మరోవైపు గోల్డ్ స్మిత్‌లకు అవకాశాలు పెంచేందుకు లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు స్థానిక ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తున్నాయి.