రైతులు ముందస్తు అవసరాలకు ,రాబోయే రబీసీజన్ కు కూడా సరిపడే యూరియా ను ఇప్పటినుండే ముందస్తు కొనుగోళ్లు జరుపుకుంటూ నిల్వలను చేసుకోవద్దని వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు సూచించారు. రాష్ట్రములో ప్రస్తుత యూరియా లభ్యత క్షేత్ర స్థాయి పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను మంత్రి కింజరాపు అచ్చెంనాయుడు నిర్వహించారు.
ఖరీఫ్ సీజన్ లో ఇప్పటి వరకు యూరియాను రాష్ట్ర అవసరం కన్నా ఎక్కువ మొత్తంలో కేంద్రము సరఫరా చేస్తున్నా, క్షేత్ర స్థాయిలో అంతర్గత యాజమాన్యం సరిగా లేకపోవడం వల్ల యూరియా పంపిణీలో చాలా చోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని , ఈ విషయం మీడియా దృష్టిలో పడి , వారి పత్రికా కథనాల వల్ల ప్రభుత్వమునకు చెడ్డపేరు వస్తున్నదని తెలిపారు. పంపిణీ వ్యవస్థలో ఏర్పడిన సమస్యను సరిగా గుర్తించి సరిదిద్దుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని, యూరియా సరఫరా, లభ్యత విషయంలో రైతులకు ఎటువంటి తప్పుడు సందేశం అందకుండా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
మార్క్ ఫెడ్ కు ,ప్రైవేట్ వ్యాపారులకు ప్రస్తుతం ఉన్న యూరియా పంపిణీ నిష్పతి 50:50 నుండి 70:30 ఉండేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. యూరియా ను వ్యవసాయేతర పరిశ్రమల అవసరాలకు దారి మళ్ళకుండా గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలని ఆదేశించారు. తక్షణమే జిల్లాల పరిధిలో పోలీస్ ,రెవెన్యూ ,పరిశ్రమలు తదితర శాఖలతో సంయుక్త విభాగాల పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసి తనికీలు చేపట్టాలని తెలిపారు. మార్క్ ఫెడ్ బఫర్ కేటాయింపుల నుండి గ్రామ సచివాలయ పరిధి లోని రైతు సేవా కేంద్రం లకు ఎరువులను సకాలములో అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
వీటికి అయ్యే రవాణా ఖర్చును ప్రభుత్వం భరించే విధముగా ప్రతిపాదనలను పంపాలని కోరారు. వ్యవసాయ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ చాలా ప్రాంతాలలో రైతులు రాబోవు రోజులలో యూరియా సరఫరా లో ఇబ్బందులు ఉంటాయనే తప్పుడు సందేశం ప్రచారంలో ఉండటం ద్వారా ,అవసరం కన్నా ఎక్కువ మొత్తములో ముందుగా కొనుగోలు చేసి ,నిల్వ చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కు 6.22 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం కేటాయించగా , రబీ సీజన్ కు 9.38 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేంద్రం కేటాయించడం జరిగిందని ,రైతులు ఎటువంటి అభత్రతకు,ఆందోళనకు గురయ్యి ఎక్కువ మొత్తంలో ఎరువులను ముందుగానే కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు.