ప్రత్యేకం హోమ్

ట్రంప్ కు బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ

#Modi

అమెరికా విధించిన 50 శాతం సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనడానికి భారత్ ప్రత్యామ్నాయ వ్యూహాన్ని రచించింది. భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ వివిధ దేశాల ఎగుమతిదారులతో వరుసగా సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. విభిన్న రంగాల ఎగుమతిదారులతో చర్చలు జరిపి, కొత్త మార్కెట్లలోకి ప్రవేశించేందుకు వ్యూహం సిద్ధం చేయనుంది.

ఒక ఉన్నతాధికారి చెప్పిన విషయాల ప్రకారం, టెక్స్టైల్‌, అప్పారెల్‌ వంటి రంగాల ఎగుమతులను పెంచడానికి యూకే, జపాన్, టర్కీ, దక్షిణ కొరియా సహా 40 దేశాల్లో ప్రత్యేక అవుట్‌రిచ్‌ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అమెరికా మార్కెట్‌పై సుమారు 10.3 బిలియన్ డాలర్ల ఎగుమతులు ఆధారపడి ఉండటంతో ఈ రంగానికి పెద్ద దెబ్బ తగలవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

గత బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన అమెరికా 50% సుంకాలు, సంవత్సరానికి 48 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులపై ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా టెక్స్టైల్‌, లెదర్‌, ఫుట్‌వేర్‌, జెమ్స్ అండ్ జ్యువెలరీ, కెమికల్స్‌ వంటి రంగాలపై ఎక్కువ భారం పడనుంది.

“అమెరికా సుంకాల వల్ల ఏర్పడిన అనిశ్చితి పరిస్థితుల్లో పోటీతత్వం నిలుపుకోవడానికి మార్కెట్లను, ఎగుమతి ఉత్పత్తులను ప్రోత్సహించడం అత్యవసరం” అని ఆ అధికారి పేర్కొన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో రసాయనాలు, ఎలక్ట్రికల్‌ కంపోనెంట్స్‌, మెరైన్‌, లెదర్‌, ఫుట్‌వేర్‌, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగాల ప్రతినిధులతో వాణిజ్య మంత్రిత్వ శాఖ సమావేశాలు ఏర్పాటు చేయనుంది.

టెక్స్టైల్‌ రంగం విషయానికి వస్తే, యూరప్‌, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, వెస్ట్‌ ఏషియా దేశాలతో సహా షార్ట్‌లిస్ట్‌ చేసిన 40 దేశాలు కలిపి590 బిలియన్ డాలర్ల టెక్స్టైల్‌, అప్పారెల్‌ దిగుమతులు చేసుకుంటున్నాయి. దీంతో భారత ఎగుమతిదారులకు విస్తృత అవకాశాలు లభిస్తాయని అధికారులు చెబుతున్నారు.

భారత టెక్స్టైల్‌ను నాణ్యత, సస్టెయినబిలిటీ, ఇన్నోవేషన్‌తో కూడిన నమ్మకమైన సరఫరాదారుగా ప్రతిష్టింపచేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఎగుమతి ప్రోత్సాహక మండళ్ల ద్వారా మార్కెట్ మ్యాపింగ్, అధిక డిమాండ్ ఉత్పత్తుల గుర్తింపు, సూరత్‌, పనిపట్‌, తిరుప్పూర్‌, భదోహి వంటి ప్రత్యేక ఉత్పత్తి క్లస్టర్లను గ్లోబల్‌ మార్కెట్లతో అనుసంధానం చేయడం జరుగనుంది.

అమెరికా సుంకాల ప్రభావానికి గురైన ఎగుమతిదారులకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం 2025-26 బడ్జెట్‌లో ప్రకటించిన ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌ కింద పలు ఆర్థిక పథకాలు సిద్ధం చేస్తోంది. ఇందులో చిన్న ఎగుమతిదారులకు కోలాటరల్‌-ఫ్రీ లోన్స్‌, చౌకైన ట్రేడ్‌ ఫైనాన్స్‌, ప్రత్యామ్నాయ ఆర్థిక సాధనాలు అందించనున్నట్లు సమాచారం.

అదేవిధంగా, ఇటీవల కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సద్వినియోగం చేసుకోవడంపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. ఒమన్‌, యూరోపియన్‌ యూనియన్‌, చిలీ, పెరూ వంటి లాటిన్‌ అమెరికా దేశాలతో వాణిజ్య చర్చలను వేగవంతం చేయాలని యోచిస్తోంది.

అమెరికా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024-25లో ఇరుదేశాల ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 131.8 బిలియన్ డాలర్లు. కాగా, అందులో భారత్‌ అమెరికాకు 86.5 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది. ఇది భారత మొత్తం 437.42 బిలియన్ డాలర్ల ఎగుమతుల్లో సుమారు 20% అని అధికారులు వెల్లడించారు.   

Related posts

సోషల్ మీడియా సైట్లపై నిషేధం: భగ్గుమన్న నేపాల్

Satyam News

ఆయుర్వేదానికి ఆదరణ పెరగాలి

Satyam News

బతుకమ్మ వేడుకలపై చిన్నచూపు ఏల?

Satyam News

Leave a Comment

error: Content is protected !!