తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పూజ గది వ్యవహారం పెద్ద వివాదంగా రూపుదాల్చింది. పూజ గది ఏమిటి వివాదాస్పదం కావడమేమిటి అనేది మీ అనుమానమైతే ఈ వార్త చదవండి. వినాయక చవితి సందర్భంగా కేసీఆర్ సతీ సమేతంగా వినాయకుడికి తన ఇంట్లో పూజ చేశారు.
ఆయనేముంది మనం కూడా మన ఇళ్లలో వినాయకచవితి జరుపుకున్నాం. వినాయకుడికి పూజ చేసిన కేసీఆర్ ఫొటోలు కూడా తీయించుకున్నారు. అయితే ఇందులో కూడా వివాదం ఉండాల్సిన అవసరం లేదు. తన తల్లి తండ్రి చేసిన ఈ మంచి పనిని వారి కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో తన పోస్టు ద్వారా ప్రపంచానికి తెలిపాడు.
అందులో కూడా తప్పు లేదు. వినాయక చవితి సందర్భంగా మా తల్లితండ్రులు వినాయకుడి పూజలో పాల్గొన్నారు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్న ఫొటోలే తాజా వివాదానికి కారణం అయ్యాయి.
కేటీఆర్ ట్విట్టర్ లో పంచుకున్న ఫొటోలలో కేసీఆర్ దంపతులు దేవుడికి నమస్కరిస్తున్నారు. అంత వరకూ బాగానే ఉంది కానీ కేసీఆర్ వినాయకుడి ప్రతిమ పెట్టిన దేవుడి గదిలో మందు బాటిళ్లు దర్శనం ఇచ్చాయి. అక్కడ ఒక స్టూల్ ఉంది.
ఆ స్టూల్ కింద మందుబాటిళ్లు కనిపించడం, అదీ కూడా కేటీఆర్ షేర్ చేసుకున్న ఫొటోలలో మందు బాటిళ్లు కనిపించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పండగ పూట కూడా తాగడం ఆపేది లేదు…. అంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. కేసీఆర్ ఇంట్లో పూజా గదిలో మద్యం స్టోర్ చేయడం ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.