భారత్ రష్యా బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. చమురు కొనుగోళ్ల నేపథ్యంలో అమెరికా సుంకాల విధింపు ఎక్కువ చేసిన నేపథ్యంలో భారత్ రష్యాలు మరింత బలంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం గమనార్హం. చైనా తియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు వెలుపల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా “రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మద్దతు” ఇచ్చుకోవాలని మళ్లీ పునరుద్ఘాటించారు. మోడీ, పుతిన్ లు ద్వైపాక్షిక సహకారం సంబంధిత పలు అంశాలపై చర్చించారు.
“ ఆర్థిక సహకారం, ఇంధన సహకారం వారి చర్చల్లో ముఖ్యాంశాలు. ఈ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు నిరంతరంగా పెరుగుతున్నందుకు ఇరువురు సంతృప్తి వ్యక్తం చేశారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రష్యా ఉక్రెయిన్ ఘర్షణలో శాంతిని తక్షణం తీసుకురావాల్సిన అవసరాన్ని మోడీ సూచించారు.
అమెరికా, యూరప్ దేశాలు భారత్ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్‌పై రష్యా దాడికి నిధులు సమకూరుస్తోందని ఆరోపిస్తున్న సమయంలో ఈ చర్చలు జరగడం విశేషం. ద్వైపాక్షిక సమావేశంలో ప్రారంభ ప్రసంగం చేస్తూ మోడీ, అమెరికా, యూరప్‌ను ఉద్దేశించి, పుతిన్‌కు “అత్యంత కఠిన కాలాల్లో కూడా భారత్–రష్యా సన్నిహిత సంబంధాలు కొనసాగించాయి” అన్నారు.
ఇది “మా ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం విలువ వలన సాధ్యమైందని ఆయన చెప్పారు. “మా సంబంధాలు కేవలం మా ప్రజలకు మాత్రమే కాదు, ప్రపంచ స్థిరత్వం, శాంతి, అభివృద్ధికి కూడా ఉపయోగపడతాయి” అని మోడీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25 శాతం శిక్షాత్మక సుంకాలను విధించారు.
దీనిపై భారత్ వ్యాఖానిస్తూ అది “అసంబద్ధత” నిర్ణయమని తెలిపింది. రష్యా ముడి చమురు అతిపెద్ద కొనుగోలుదారు చైనా కాగా, రష్యా వాయువు అతిపెద్ద కొనుగోలుదారు యూరప్ అయినప్పటికీ, వారిపై ఎలాంటి శిక్షాత్మక సుంకాలు లేవని గుర్తుచేసింది. భారత్ అమెరికా వాణిజ్య చర్చలు నిలిచిపోయిన తర్వాత, భారత్ ఇప్పటికే 25 శాతం సుంకాన్ని ఎదుర్కొంటోంది.
అదనంగా 25 శాతం శిక్షాత్మక సుంకం విధించడంతో అమెరికాకు భారత వస్తువుల ఎగుమతులపై మొత్తం 50 శాతం సుంకం విధించినట్లయింది. ఉక్రెయిన్ ఘర్షణపై మోడీ మాట్లాడుతూ, “శాంతిని తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలను భారత్ స్వాగతిస్తుంది. అన్ని పక్షాలు నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతాయని ఆశిస్తున్నాం” అన్నారు.
“ఘర్షణను ముగించడం, స్థిరమైన శాంతి దిశగా మార్గం కనుగొనడం అవసరం” అని మోడీ పేర్కొన్నారు. ఘర్షణను వీలైనంత త్వరగా ఆపి, శాశ్వత శాంతి పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి ప్రాధాన్యతగా ప్రస్తావించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.