జాతీయం హోమ్

రేప్ కేసు నిందితుడైన ఆప్ ఎమ్మెల్యే పరార్

#APP

అత్యాచారం కేసులో నిందితుడైన పంజాబ్ లోని ఆప్ నాయకుడు, సనౌర్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పాఠణ్మాజ్రా నాటకీయ పరిణామాలతో పోలీసు అరెస్టు నుంచి తప్పించుకు పారిపోయాడు. అత్యాచార కేసులో ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన జరిగింది.

కర్ణాల్ జిల్లా దబ్రీ గ్రామంలోని ఆయన బంధువు ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పటియాలా పోలీస్ బృందం, స్థానిక కర్ణాల్ పోలీసులు, ముగ్గురు ఎస్‌హెచ్‌ఓ స్థాయి అధికారులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకొని ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని ప్రయత్నించింది. అయితే పాఠణ్మాజ్రా తెల్లటి SUVలో పారిపోవడమే కాకుండా గ్రామస్తులు, అనుచరుల సహకారం కూడా పొందారని సమాచారం.

తప్పించుకునే సమయంలో కాల్పులు కూడా జరిగినట్టు పోలీసులు తెలిపారు. “పోలీసులు అధిక సంఖ్యలోనే ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే స్థానికుల సహాయంతో తప్పించుకున్నాడు. ప్రస్తుతం హర్యానా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఆయనను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం” అని ఒక సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.

ఈ క్రమంలో ఒక పోలీసు కానిస్టేబుల్ SUV ఢీకొనడంతో గాయపడ్డాడు. విధి నిర్వహణలో ఉన్న పోలీసును గాయపరిచినందుకు మరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ పరిణామం కొన్ని గంటల ముందే పాఠణ్మాజ్రా తన స్వంత పార్టీ ప్రభుత్వంపై వరద సహాయక చర్యలపై విమర్శలు చేసి, “ఢిల్లీ లాబీ” పంజాబ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపించిన తరువాత జరిగింది.

ఇదిలా ఉండగా, పాఠణ్మాజ్రా అనుచరులు నిరసన లేదా ధర్నా చేపట్టవచ్చన్న ఆందోళనల మధ్య పటియాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఎమ్మెల్యేను కనుగొని అరెస్టు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. మంగళవారం తెల్లవారుజామునే పాఠణ్మాజ్రాపై అత్యాచార ఆరోపణల కేసు నమోదు చేశారు.

సోమవారం సాయంత్రం ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారని,  అంత వరకూ కేసు దర్యాప్తులో ఉన్నదని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఆగస్టు 26న బాధిత మహిళ కొత్త ఫిర్యాదు సమర్పించిందని, పెళ్లి వాగ్దానం చేస్తూ ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధించాడని ఆరోపించినట్లు ఒక ప్రభుత్వ వర్గం వెల్లడించింది.

“ఫిర్యాదు విషయం తెలుసుకున్న తరువాత అరెస్టు భయంతో ఎమ్మెల్యే ప్రభుత్వం మీద బహిరంగంగా దాడి చేయడం మొదలుపెట్టాడు” అని ఒక ఆప్ నేత వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం పాఠణ్మాజ్రా సోషల్ మీడియా లైవ్‌లో మాట్లాడుతూ, తనపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమని అన్నారు.

“నాపై కేసులు పెట్టి నన్ను మౌనంగా చేయలేరు. నా నియోజకవర్గ ప్రజల కోసం నేను నా గొంతు వినిపిస్తూనే ఉంటాను. ఢిల్లీ లాబీ విభేదాలను అణచివేయడానికి అన్నీ ప్రయత్నాలు చేస్తుంది” అని లైవ్ ప్రసారంలో పేర్కొన్నారు. సోమవారం, పార్టీ హఠాత్తుగా ఎమ్మెల్యే భద్రతను తొలగించి, సనౌర్ నియోజకవర్గంలోని అన్ని ఎస్‌హెచ్‌ఓలు, పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జ్‌లను బదిలీ చేసింది.

ఇటీవలే పాఠణ్మాజ్రా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నీటి పారుదల శాఖ అధికారులు నదీ పరిసరాల్లో డీసిల్టింగ్ పనులు చేస్తుంటే అడ్డుకున్నారని, దీని వల్లే ఇటీవల వరదల తీవ్రత పెరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొన్ని నెలల క్రితం పాఠణ్మాజ్రాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెబుతూ అదనపు భద్రతను కల్పించారు.

అయితే పార్టీ అగ్ర నాయకత్వం ఆదేశాల మేరకు పటియాలా పోలీసులు సోమవారం ఆయన భద్రత కోసం నియమించిన ఎనిమిది మంది గన్‌మన్‌లను వెనక్కి పిలిపించుకున్నారు.

Related posts

తెలంగాణ అగర్వాల్ సమాజ్ కార్యాచరణ ఇదీ…

Satyam News

కొడంగల్ లో వీధి కుక్కల స్వైర విహారం

Satyam News

ఆత్మప్రబోధం ప్రకారం ఓటు వేయండి

Satyam News

Leave a Comment

error: Content is protected !!