ప్రత్యేకం హోమ్

బంగారం స్మగ్లింగ్: నటి రన్యారావుకు రూ.102 కోట్ల భారీ జరిమానా

#RanyaRao

కర్ణాటక నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో మరొక సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమెపై ఈ రోజు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్ఐ) రూ.102 కోట్ల భారీ జరిమానా విధించింది. స్మగ్లింగ్‌లో పట్టుబడిన బంగారం విలువతో పాటు గతంలో ఆమె చేసిన అక్రమ రవాణా ప్రయాణాలపై ఆధారాలు లభించడంతో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

గత మార్చి 3న రన్యా రావు దుబాయ్‌ నుంచి బెంగళూరుకు చేరుకున్నప్పుడు కెంపెగౌడ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. తన శరీరానికి, వస్త్రాల మధ్య, జుట్టులో దాచిన 14.2 కిలోల బంగారం (విలువ రూ.12.5 కోట్లు) స్వాధీనం చేశారు. విచారణలో ఆమె 2023 నుంచి 2025 మధ్యలో 52 సార్లు దుబాయ్‌కి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్మగ్లింగ్ మాఫియాతో సంబంధాలున్నాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

కేసులో సమర్పించిన ఆధారాల ప్రకారం ప్రత్యేక కోర్టు రన్యా రావును COFEPOSA చట్టం కింద ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. అంతేకాకుండా, శిక్షా కాలంలో ఆమెకు బెయిల్ అనుమతి ఇవ్వబోమని కోర్టు స్పష్టంచేసింది. దీంతో ప్రస్తుతం ఆమె బెంగళూరులోని మహిళా జైలులో శిక్ష అనుభవిస్తోంది.

ఇప్పటివరకు జైలు శిక్షతోనే ముగిసిన ఈ కేసులో మంగళవారం మరో కొత్త పరిణామం చోటుచేసుకుంది. డీఆర్ఐ అధికారులు ప్రత్యేక దర్యాప్తు నివేదిక ఆధారంగా రన్యా రావుకు రూ.102 కోట్ల భారీ జరిమానా విధించారు. స్మగ్లింగ్‌ ద్వారా ప్రభుత్వానికి కలిగిన నష్టం, పన్ను ఎగవేత మరియు రవాణా నిబంధనల ఉల్లంఘన ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.

ఈ కేసు కేవలం స్మగ్లింగ్ పరిమితిలోనే ఆగిపోకుండా, రాజకీయ కోణంలో కూడా మలుపులు తిరుగుతోంది. రన్యా రావు తండ్రి, ఐపీఎస్ అధికారి కె. రామచంద్ర రావు గతంలో వివాదాస్పద పరిస్థితుల మధ్య పదవినుంచి తప్పించబడ్డా, ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆయనను మళ్లీ డీజీపీగా నియమించింది. ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఇక, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగింది. ఈ కేసులో మనీలాండరింగ్ అంశాలను దర్యాప్తు చేస్తూ, కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వరరావును కూడా విచారణకు పిలిచే అవకాశముందని వర్గాలు చెబుతున్నాయి.

బంగారం స్మగ్లింగ్ కేసులో ఒక నటి ఇంత భారీ మొత్తంలో చిక్కుకోవడం కర్ణాటకలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు జైలు శిక్షతో పాటు రూ.102 కోట్ల జరిమానా విధించడం మరింత కలకలం రేపుతోంది. రాబోయే రోజుల్లో ఈ కేసు ఎటు తిరుగుతుందో, ఇంకా ఎవరెవరిపై దర్యాప్తు జరగబోతుందో అన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Related posts

సుభాష్ నేరాన్ని సమర్థించే వారు ఇది తెలుసుకోవాలి….

Satyam News

మంగళగిరిని మంత్రి లోకేష్‌ ఏం చేయబోతున్నారు?

Satyam News

దుర్గమ్మను దర్శించుకున్న హోం మంత్రి అనిత

Satyam News

Leave a Comment

error: Content is protected !!