అక్షరాస్యతలో హిమాచల్ ప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తూ కొత్త చరిత్ర సృష్టించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు సోమవారం రాష్ట్రాన్ని పూర్తిగా అక్షరాస్య రాష్ట్రంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ప్రాయోజకత్వంలో అమలవుతున్న ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమం కింద 95 శాతం పైగా అక్షరాస్యత సాధించిన రాష్ట్రాన్ని పూర్తిగా అక్షరాస్య రాష్ట్రంగా గుర్తిస్తారు.
హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు 99 శాతం అక్షరాస్యతతో దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలిచింది. 1947లో హిమాచల్‌లో అక్షరాస్యత రేటు కేవలం 7 శాతం మాత్రమే ఉండగా, ఈ రోజు దాదాపు 99 శతానికి చేరుకోవడం రాష్ట్ర ప్రజల పట్టుదలకూ, ప్రభుత్వ కృషికీ నిదర్శనంగా నిలిచింది. ఇతర రాష్ట్రాల పరిస్థితిని పరిశీలిస్తే, కేరళ 96 శాతం అక్షరాస్యతతో ఇప్పటివరకు అగ్రగామిగా నిలిచిన రాష్ట్రం.
దాని తర్వాత త్రిపుర, మిజోరామ్, గోవా వంటి రాష్ట్రాలు 90 శాతం పైబడిన అక్షరాస్యత రేటుతో ఉన్నాయి. దేశంలోని పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లో అక్షరాస్యత రేటు 80-85 శాతం మధ్యలో ఉండగా, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో మాత్రం ఇది 70 శాతం దాకా మాత్రమే ఉంది.
ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ 99 శాతం అక్షరాస్యత సాధించడం ఒక విశిష్టమైన ఘట్టంగా భావించబడుతోంది. “మన రాష్ట్రం పూర్తిగా అక్షరాస్య రాష్ట్రం కావడం మనందరికీ గర్వకారణం” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విద్యామంత్రి రోహిత్ ఠాకూర్ మాట్లాడుతూ, “దేశంలోనే అత్యధిక అక్షరాస్యత రేటు సాధించడం హిమాచల్ కృషికి ప్రతిఫలంగా నిలిచింది” అని అన్నారు.