ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా వి. హర్షవర్ధన్ రాజు ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీని ఏఎస్‌పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, ఎఆర్ అదనపు ఎస్పీ కె. శ్రీనివాసరావు, అన్ని సబ్‌డివిజనల్ డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు ఈ జిల్లాకు ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ జిల్లాకు ప్రత్యేకమైన గౌరవం, మంచి పేరు ఉంది. ఆ పేరుకు మరింత నిలువ వుండేలా కృషి చేసి, ప్రజలకు సేవ చేయడానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణను ప్రధాన లక్ష్యంగా చేసుకుని విధులు నిర్వహిస్తానని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, సిబ్బంది నుండి అధికారుల వరకు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజలకు ఉత్తమమైన సేవలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
మహిళల భద్రత, వారి రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. శక్తి యాప్‌పై మరింత విస్తృతంగా అవగాహన కల్పించి, ప్రతి మహిళ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆపదసమయాల్లో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ, నేరాల నియంత్రణ విషయంలో ఎటువంటి రాజీ పడబోమని, అసాంఘిక కార్యకలాపాలను అరికడుతూ, నేరరహిత జిల్లాగా మార్చడంలో తనదైన పాత్ర పోషిస్తాన్నారు.
నేరాలు, చట్టవ్యతిరేక లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, ప్రోత్సహించినా, శాంతి భద్రతలకు మరియు ప్రజాశాంతికి విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యాచరణలు రూపొందిస్తూ, నూతన ప్రణాళికలను అమలు చేస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.