జాతి వివక్షతతో అమెరికా పోలీసులు ఒక ముస్లిం యువకుడిని కాల్చి చంపారు. అమెరికాలో పోలీసులు కాల్పులు జరపడంతో తెలంగాణకు చెందిన ఓ యువకుడు మృతిచెందిన ఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా నివాసి అయిన 30 ఏళ్ల మొహమ్మద్ నిజాముద్దీన్ సెప్టెంబర్ 3న జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
కుటుంబసభ్యుల వివరాల ప్రకారం, నిజాముద్దీన్ తన సహచరుడితో జరిగిన ఘర్షణ అనంతరం పోలీసులు జోక్యం చేసుకున్నప్పుడు కాల్పులు జరగడంతో మృతి చెందాడు. సాంటా క్లారా పోలీస్ విభాగం విడుదల చేసిన వీడియో ప్రకారం, 911 ఎమర్జెన్సీ కాల్ ఆధారంగా అక్కడికి చేరుకున్న పోలీసులు, ఒక వ్యక్తి కత్తితో తన రూమ్‌మేట్‌పై దాడి చేస్తున్నట్లు గమనించినట్టు తెలిపారు. హెచ్చరికలు ఇచ్చినా వినకపోవడంతో పోలీసులు కాల్పులు జరపగా, నాలుగు బుల్లెట్లు తగిలి నిజాముద్దీన్ కుప్పకూలాడు.
అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరణానికి కొద్ది రోజుల ముందు నిజాముద్దీన్ తన సోషల్ మీడియా పోస్టుల్లో తాను అమెరికాలో జాతి వివక్ష, వేధింపులు, వేతన మోసం, ఉద్యోగం నుంచి తప్పుగా తొలగించడం, అన్యాయ హింసలకు బలయ్యానని పేర్కొన్నాడు.
“కార్పొరేట్ దౌర్జన్యాలను ఎదుర్కొని పోరాడుతున్నాను. ఈ అణచివేత ఆగాలి. ఇందులో పాలుపంచుకున్న వారందరినీ కఠినంగా శిక్షించాలి” అని తన పోస్ట్‌లో రాశాడు. అలాగే, తనకు ఆహారంలో విషం కలిపారని, ఇంటి నుంచి బలవంతంగా పంపించివేస్తున్నారని కూడా ఆరోపించాడు.
ఒక రేసిస్ట్ డిటెక్టివ్ సహాయంతో ఉద్యోగం నుంచి తొలగించి, వేధింపులు కొనసాగించారని తన పోస్టులో పేర్కొన్నాడు. నిజాముద్దీన్ తండ్రి మొహమ్మద్ హస్నుద్దీన్ మాట్లాడుతూ, “నా కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం, అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, సాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్ సహాయం చేయాలి” అని కేంద్రాన్ని కోరాడు. నిజాముద్దీన్ అమెరికాలో ఎంఎస్ పూర్తిచేసి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.