నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మరో గుడ్ న్యూస్. కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషితో అమరావతి నిర్మాణ పనులు ఇప్పటికే జెట్ స్పీడ్‌లో కొనసాగుతుండగా..తాజాగా అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ – ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అదనంగా మరో రూ.14 వేల 200 కోట్ల రుణం పొందనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ అదనపు రుణం పొందేందుకు కేంద్రం ఏపీ ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అమరావతి పరిధిలో వివిధ ప్రాజెక్టులకు రూ.14,200 కోట్ల రుణం అందించనున్నాయి ప్రపంచ బ్యాంక్ – ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మరోవైపు, హడ్కో నుంచి మరో 11 వేల కోట్ల రూపాయల రుణం అందనుంది. అదనపు రుణం కూడా మంజూరైతే మొత్తం రాజధాని నిర్మాణం కోసం రూ. 40 వేల కోట్ల రూపాయలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 88 వేల కోట్ల రూపాయలతో అమరావతిలో పనులకు ప్రణాళిక రూపొందించింది కూటమి ప్రభుత్వం.
ఇప్పటికే 50 వేల కోట్ల రూపాయల విలువైన పనులు కొనసాగుతున్నాయి. CRDA, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ పనుల కోసం వేగంగా టెండర్లు పిలుస్తున్నాయి. అమరావతిలో ఇతర ప్రాజెక్టుల కోసం SPV ఏర్పాటు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. అదనపు రుణం కోసం ప్రపంచ బ్యాంక్ – ఏడీబీకి దరఖాస్తు చేయనుంది . మొత్తంగా, అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అదనంగా మరో 1.6 బిలియన్ డాలర్ల రుణం అందనుంది.