ఫ్రెంచ్ విమాన యంత్రాంగ తయారీ దిగ్గజం సఫ్రాన్ భారత్ కు కొత్త ప్రతిపాదన పంపింది. తేజస్ Mk-2 యుద్ధవిమానాల కోసం ఇంజిన్ ఉత్పత్తి చేయాలన్న ప్రతిపాదనను సమర్పించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) ఈ ప్రతిపాదనలోని వివిధ అంశాలను పరిశీలిస్తోందని వర్గాలు తెలిపాయి.
అయితే, ఇప్పటివరకు ఏ విధమైన తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి. ఈ ప్రక్రియ సాకారం అయితే అమెరికా జనరల్ ఎలక్ట్రిక్ (GE) F-414 ఇంజిన్ ను భారత్ తీసుకోవడం విరమిస్తుందా అనే చర్చ ప్రారంభం అయింది. అయితే తేజస్ యుద్ధ విమానాల ఇంజిన్ ను సఫ్రాన్ నుంచి తీసుకుంటే అమెరికా ఇంజిన్ ను ఇక తీసుకోమనే అర్థం కాదని అధికారులు పేర్కొన్నారు.
ఇప్పటికే HAL (హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) తయారీ చేస్తోన్న తేజాస్ Mk-1A కంటే శక్తివంతమైన, అధునాతనమైన తేజాస్ Mk-2 తొలి విమాన ప్రయోగం 2026 ప్రారంభంలో జరగనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సఫ్రాన్ భారత్‌లో ఇంజిన్ తయారీకి పూర్తి ఎకో-సిస్టమ్ ఏర్పాటుకు సిద్ధమైందని, తేజాస్ Mk-2తో పాటు తదుపరి తరం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) కోసం రెండు వేర్వేరు ఇంజిన్లను అందించేందుకు ఆఫర్ చేసినట్టు తెలిసింది.
ఇప్పటికే HALతో భాగస్వామ్యంలో సఫ్రాన్ తయారు చేసిన హెలికాప్టర్ ఇంజిన్లు 400కి పైగా అధునాతన లైట్ హెలికాప్టర్లలో వినియోగంలో ఉన్నాయి. అయితే, తేజస్ Mk-2 రూపకల్పన GE F-414 ఇంజిన్ స్పెసిఫికేషన్ల ఆధారంగా చేయబడింది.
ఈ దశలో ఇంజిన్ మార్పు చేయాలంటే విమాన నిర్మాణంలో పలు మార్పులు అవసరం అవుతాయి. గత సంవత్సరం జూలైలో ఢిల్లీ-వాషింగ్టన్‌లు కలిసి GE F-414 ఇంజిన్‌ను భారత్‌లో తయారు చేయాలని, అందుకు టెక్నాలజీ బదిలీ (ToT) ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ప్రస్తుతం HAL- GE మధ్య ToT షరతులపై చర్చలు కొనసాగుతున్నాయి. దీనికి అమెరికా ప్రభుత్వ అనుమతి అవసరం. ఇకపోతే, తేజాస్ Mk-1A కోసం GE సరఫరా చేయాల్సిన F-404 ఇంజిన్లలో ఆలస్యం ఏర్పడింది. HAL తయారు చేసిన దాదాపు డజను విమానాలు ఇంజిన్ లేక అలా వృధాగా ఉండగా, ఇప్పటివరకు కేవలం మూడు ఇంజిన్లనే GE పంపినట్లు తెలిసింది.
దీని వలన వాయుసేనకు యుద్ధవిమానాల డెలివరీ ఆలస్యం అవుతోంది. సెప్టెంబర్ 11న భారత్‌లో కొత్త అమెరికా రాయబారి-డిజిగ్నేట్ సర్జియో గోర్, భారత్-అమెరికా రక్షణ వాణిజ్యాన్ని విస్తరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
“భారత్‌తో రక్షణ సహకారం అనేది సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తి ఒప్పందాలు, ముఖ్యమైన రక్షణ విక్రయాలపై కేంద్రీకృతమై ఉంది” అని ఆయన అమెరికా సెనేట్ విచారణలో పేర్కొన్నారు. గత ఆగస్టులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా భారత్‌లో జెట్ ఇంజిన్ల ఉత్పత్తికి సఫ్రాన్‌తో భాగస్వామ్యం చేస్తామని ప్రకటించారు.