అంబేద్కర్ కోనసీమలో అరుదైన ఆనంద ఘట్టం ఆవిష్కృతం అయింది. ఒక తల్లి ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేటలోని భాస్కరా పిల్లల ఆసుపత్రిలో ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అమలాపురం ఈదరపల్లికి చెందిన కుంపట్ల దుర్గ – సతీష్ దంపతులకు పెళ్లయి రెండు సంవత్సరాలైనా సంతానం కలగలేదు. దాంతో వారు కొత్తపేటలోని భాస్కరా చిల్డ్రన్స్ ఐవీఎఫ్ ఆసుపత్రి డాక్టర్ ప్రదీప్తి కరణను సంప్రదించగా, ఆమె వైద్యంతో గర్భధారణ సాధ్యమైంది.
స్కానింగ్‌లో ఒకే గర్భంలో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు గుర్తించి, ఇది కొంత ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. అయితే తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు వచ్చారు. ఎనిమిదో నెలలో నొప్పులు రావడంతో, డాక్టర్ ప్రదీప్తి కరణ బృందం ఆపరేషన్ చేసి సురక్షితంగా ముగ్గురు పసికందులను బయటకుతీశారు. మొదట అమ్మాయి, తరువాత అబ్బాయి, చివరిగా అమ్మాయి జన్మించారు. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారు. పిల్లలను అదే ఆసుపత్రిలోని పిల్లల వైద్యులు మెంటే శ్రీధర్ ప్రత్యేక పర్యవేక్షణలో పరిశీలిస్తున్నారు.
ఇదే ఆసుపత్రిలో గతంలో కూడా ఒకే కాన్పులో ముగ్గురు అమ్మాయిలు పుట్టిన సంఘటన చోటుచేసుకుంది. తాజాగా ముగ్గురు పిల్లలు పుట్టడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.