ఖాట్మండులో చిక్కుకున్న భారతీయులను తిరిగి రప్పించేందుకు ఎయిర్ ఇండియా, ఇండిగో అదనపు విమానాలను నడపనున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్మోహన్ నాయుడు బుధవారం ప్రకటించారు. నేపాల్ దేశం మొత్తం అశాంతి పరిస్థితులు నెలకొన్న కారణంగా ఎంతో మంది భారతీయులు అక్కడ చిక్కుకున్నారు.
ఈ ప్రత్యేక విమాన చార్జీలు సాధారణ రోజుల్లో ఉన్నట్లే ఉంచాలని, పెంచరాదని కూడా మంత్రి తెలిపారు. “నేపాల్ విమానాశ్రయం మూసివేత కారణంగా అనేక మంది ప్రయాణికులు తమ ఇళ్లకు చేరుకోలేకపోయారు. ఇప్పుడు ఖాట్మండు విమానాశ్రయం మళ్లీ ప్రారంభమైనందున, ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థల సహకారంతో ఈ రోజు సాయంత్రం నుంచే అదనపు విమాన సౌకర్యాలు కల్పించాం.
రేపటి నుండి షెడ్యూల్ విమానాలు కూడా పునరుద్ధరించబడతాయి” అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎయిర్ ఇండియా తనవైపు నుండి బుధవారం, గురువారం న్యూఢిల్లీ–కాఠ్మాండు మార్గంలో ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు ప్రకటించింది.
నేపాల్‌లో జరిగిన అల్లర్ల కారణంగా ఖాట్మండు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేయబడింది. ఆ విమానాశ్రయం బుధవారం మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించింది.