చిత్తూరు హోమ్

స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం

#Anam

స్త్రీ శక్తి పథకాన్ని తిరుపతి బస్టాండ్  నుండి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చరిత్రలో  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసే అవకాశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కూటమి ప్రభుత్వం కల్పించడం ఒక సువర్ణ అధ్యాయం అని అన్నారు.

ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని అందులో మహిళలకు బస్సులలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చారని దాన్ని నిలబెట్టుకోవడంలో భాగంగా నేడు స్వాతంత్ర్య  దినోత్సవం రోజు నుండి రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు.

ఈరోజు జరిగిన స్వాతంత్ర్య  దినోత్సవ వేడుకలలో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు వివిధ శాఖల సమన్వయంతో అందించిన సంక్షేమ ఫలాల లబ్ధిని వివరించడం జరిగిందని అన్నారు. మన రాష్ట్ర జనాభా 5 కోట్ల 25 లక్షల మంది ఉంటే అందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని ఈ పథకం అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలలో ఒక కోటి 42 లక్షల మంది ఉచిత బస్సుల సౌకర్యాన్ని ఉపయోగించుకుంటారని అంచనా వేస్తున్నామని అన్నారు.

ఎన్నికల హామీలు నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమిష్టిగా అమలు చేస్తున్న నిర్ణయాలతో సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీల మేరకు 99 శాతం పూర్తి చేశారని అన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల ముందు చెబితే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించాయని కానీ నేడు ఆ హామీని అమలు చేసి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించామని అన్నారు.

మహిళలు పల్లె వెలుగు ఆల్ట్రాపల్లె వెలుగు, ఎక్స్ప్రెస్,  మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ వంటి ఆర్టీసీ సర్వీసులలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆధార్ ,ఓటర్ కార్డు, రేషన్ కార్డు వంటివి చూపించి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అన్నారు. మన రాష్ట్రంలో 11449 ఆర్టీసీ బస్సులు ఉంటే అందులో 8458 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని అన్నారు. కార్యక్రమం అమలు ద్వారా ఒక నెలకు రూ.162 కోట్లు ఖర్చు అవుతుందని సంవత్సరానికి రూ. 1942 కోట్లు ఖర్చు అవుతుందని ఈ ఖర్చును బడ్జెట్ రూపంలో తీసుకొని వచ్చి ఆర్టీసీ కు అందించడం జరుగుతుందని అన్నారు. 

8458 బస్సుల్లో సుమారు రోజుకు 25 లక్షల మంది మహిళలు ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తెలంగాణ,  కర్ణాటక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని మహిళల సంక్షేమం కోసం కొన్ని వేల కోట్లను ఖర్చు చేస్తున్నాయని ఇదే రీతిలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,  మంత్రి నారా లోకేష్ ,  ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని అన్నారు.

తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, ముఖ్యమంత్రి ఈ అవకాశాన్ని కల్పించడం నాకు పూర్వ జన్మ సుకృతం అని అన్నారు. మహిళల యొక్క ఆశీర్వచనాలతో కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తుందని రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చెప్పిన కార్యక్రమాలతో పాటు కొత్త కార్యక్రమాలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అమలు చేస్తామని అన్నారు . ప్రజలు, మహిళలు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.

మహిళలకు వరం స్త్రీశక్తి పథకం

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం మహిళలకు వరం అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు మహిళలందరికీ స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచితంగా బస్సులలో ప్రయాణించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి విజయవాడలో నేడు  ప్రారంభించారని, మన జిల్లాలో తిరుపతి పట్టణం నందు  దేవాదాయ శాఖ మంత్రి చేతులు మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు.

మన జిల్లాలో  పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో మహిళలు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఒరిజినల్ ఐడి కార్డు చూపించి జిల్లా, రాష్ట్రంలో ఏ ప్రాంతం కైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం ప్రభుత్వం కల్పించిందని  ఉన్నారు. మన జిల్లాలో సగటున రోజుకు 41 వేలమంది బస్సుల ద్వారా ప్రయాణం చేస్తున్నారని ఈ కార్యక్రమం అమలుతో మరో 30  వేల మంది మహిళలు  అదనంగా ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నామని అన్నారు.

11 డిపోల పరిధిలోని  177 రూట్ లలో 356 బస్సులలో మహిళలు ఈ అవకాశం వినియోగించుకోవచ్చని అన్నారు. ఈ పథకం ద్వారా సంవత్సరానికి 82.71 కోట్లు మహిళలకు లబ్ధి చేకూరడం జరుగుతుందని అంటే నెలకు 1050 రూపాయలు ఆదా మరియు లబ్ధి చేకూరనున్నదనీ అన్నారు. ఈ పథకం ఏ బస్సుల్లో వర్తిస్తుందో ఆ బస్సులకు ముందు రాయడం జరుగుతుందని, ఆ బస్సులలో మహిళల కోసం ప్రత్యేకంగా పసుపు రంగుతో సీట్లు ఉంటాయని ఈ విషయాన్ని గమనించి మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి,  తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్, యాదవ  కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, తదితరులు పాల్గొన్నారు

Related posts

హనుమాన్ విగ్రహంపై దారుణ వ్యాఖ్యలతో వివాదం

Satyam News

కూటమి ప్రభుత్వ సూపర్ సిక్స్… సూపర్ హిట్

Satyam News

పెదవేగి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రవికుమార్

Satyam News

Leave a Comment

error: Content is protected !!