పి4 (Public-Private-People Partnership) పథకం అమలులో మార్గదర్శకులను బలవంతంగా ఎంపిక చేస్తున్నామని జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి వాస్తవం లేదని పి4 ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు అన్నారు.
ప్రభుత్వ అధికారులకు టార్గెట్లు నిర్వహించి మార్గదర్శకులను ఎంపిక చేస్తున్నారనేది అసత్యమని గుంటూరులో ఆదివారం నాడు రేపటికోసం తెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో పి4 అమలులో వస్తోన్న సమస్యలు-పరిష్కారమార్గాలపై ఓ సదస్సును నిర్వహించారు.
ఈ సదస్సులో కుటుంబరావు ముఖ్య అతిథిగా పాల్గొని సభకు వచ్చిన వారితో నేరుగా చర్చించారు. ముందుగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనల మేరకే పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ పథకాన్ని తెచ్చామని అన్నారు.
సమాజంలో పేదరికం నిర్మూలనకు చంద్రబాబునాయుడు చిత్తశుద్దితో పనిచేస్తున్నారని, ఆయనకు సహకారం అందించడం అందరి విధి అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2047నాటికి పేదలు లేని రాష్ట్రంగా చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుందని, దీనిలో భాగంగా ప్రజలు, ప్రవేట్, ప్రజలభాగస్వామ్యంలో పేదరికాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తున్నామన్నారు.
కొన్ని పత్రికలు, కొందరు వ్యక్తులు, కొన్ని పార్టీలు దీనిపై అనవసర విమర్శలు చేస్తున్నాయని, అయితే తాము ఈ విమర్శలను స్వీకరిస్తున్నామని అన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎంతగా కించపరిచినా..తాము తమ పనిచేస్తూనే ఉంటామని, సమాజంలో నిరుపేదలు లేకుండా చేయాలనే లక్ష్యాన్ని వదులుకోబోమని ఆయన అన్నారు.
అయితే..ఈ పథకం అమలులో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, లబ్దిదారుల ఎంపిక, మార్గదర్శకుల ఎంపిక, నిధులు వినియోగం..ఇలా అనేక సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ నిదానంగా పరిష్కరిస్తూ..ముందుకు వెళుతున్నామన్నారు.
రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం ఏడాదికి రెండున్నర లక్షలు రూపాయిలుగా చెబుతున్నారని, అయితే వాస్తవానికి దీనిలో 20శాతం ధనికులే ఉంటారని, మిగిలిన వారంతా పేదలేనని అన్నారు. ఈ 20శాతం ధనికుల ఆదాయాన్ని తీసివేస్తే..ఒక్కొక్కరి తలసరి ఆదాయం నెలకు రూ11వేలకు మించదని, అటువంటి పరిస్థితుల్లో పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు తెచ్చిన ఈ పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా పలువురు అడిగిన సందేహాలకు ఆయన సవివరంగా సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు, పత్తిపాడు ఎమ్మెల్యేలు నజీర్, రామాంజనేయులు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, రెరా మాజీ ఛైర్మన్ రామ్‌నాథ్, పి4 సిఇఓ, రేపటికోసం పత్రిక ఎడిటర్ శాఖమూరి శ్రీనివాసప్రసాద్, పత్రిక ఎండి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సదస్సుకు అతిధిలు అనుకున్నదాని కన్నా భారీస్థాయిలో హాజరయ్యారు. పి4 పథకంపై ప్రజల్లో ఇతర వర్గాల్లో వ్యక్తం అవుతోన్న సందేహాలకు ఎంతో కొంత మేర ఈ సదస్సు జవాబు ఇచ్చినట్లే. ఇటువంటి సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందనే సూచనలు పలువురి నుంచి వచ్చాయి.