ముఖ్యంశాలు హోమ్

అమరావతి మీదుగా 3 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు

#BulletTrain

ఏపీ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం సైతం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు సెంటర్‌గా అమరావతిని మార్చేందుకు కేంద్రం తన వంతు సహాయాన్ని అందిస్తోంది. ఈ మేరకు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో అమరావతికి చోటు కల్పించింది కేంద్రం.

అమరావతి మీదుగా బుల్లెట్‌ రైళ్లు దూసుకెళ్లనున్నాయి. ఈ రైళ్లు పరుగులు పెట్టేందుకు వీలుగా హైదరాబాద్‌-చెన్నై మధ్య హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ రైలు కారిడార్‌ నిర్మాణం చేపట్టనున్నారు. దీని ఎలైన్‌మెంట్‌కు ప్రాథమిక ఆమోదం లభించింది. ఇది CRDA మీదుగా వెళ్లనుంది. ఇక హైదరాబాద్ – బెంగళూరు హైస్పీడ్‌ రైలు కారిడార్ ఎలైన్‌మెంట్‌కూ కేంద్రం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.

ఇందులో భాగంగా హైదరాబాద్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మీదుగా కూడా బుల్లెట్‌ రైళ్లు పరుగులు పెట్టనుంది. ఈ రెండు కారిడార్ల నిర్మాణం పూర్తయితే ఏపీతో పాటు తెలంగాణ ముఖ చిత్రమే మారిపోనుంది. మెట్రో నగరాల మధ్య బుల్లెట్‌రైళ్లు నడిపేందుకు కేంద్రం హైస్పీడ్‌ ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మిస్తుండగా, ఇందులో ఏపీ మీదుగా హైదరాబాద్‌-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్లకు చోటు కల్పించారు.

ఈ రెండు కారిడార్లలోనూ హైదరాబాద్‌ నుంచి శంషాబాద్‌ వరకు 38.5 కి.మీ. కామన్‌గా ఉండనుంది. అక్కడి నుంచి చెన్నై, బెంగళూరు వైపు వేర్వేరు కారిడార్లు ఉంటాయి. హైదరాబాద్‌-చెన్నై హైస్పీడ్‌ కారిడార్‌ కోసం 744.57 కిలోమీటర్లు, 839.5 కిలోమీటర్లు, 749.5 కిలో మీటర్ల 3 ఎలైన్‌మెంట్లను పరిశీలించి, ఇందులో 744.5కిలోమీటర్ల ఎలైన్‌మెంట్‌ను ప్రాథమికంగా ఖరారు చేశారు.

ఇందులో తెలంగాణలో ఆరు, ఏపీలో ఎనిమిది, తమిళనాడులో ఒక స్టేషన్‌ నిర్మిస్తారు. ఇది హైదరాబాద్‌ పరిధిలోని.. హైదరాబాద్‌-ముంబయి హైస్పీడ్‌ రైలు కారిడార్‌ నుంచి మొదలై..శంషాబాద్, నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం లేదా కోదాడ మీదుగా వచ్చి CRDA మీదుగా గుంటూరు వైపు వెళ్తుంది. అక్కడి నుంచి చీరాలవైపు వెళ్లి విజయవాడ-చెన్నై రైల్వేలైన్‌కు సమాంతరంగా చెన్నై వెళ్తుంది.

తెలంగాణలో 236.48 కి.మీ., ఏపీలో 448.11 కి.మీ, తమిళనాడులో 59.98 కి.మీ. వెళ్తుంది. ఇది నేరుగా చెన్నైకి కాకుండా తిరుపతి మీదుగా వెళ్లేలా ఎలైన్‌మెంట్‌లో మారిస్తే తిరుపతికి వెళ్లేవారికి ప్రయోజనకరమనే ప్రతిపాదన కూడా వచ్చింది. గూడూరు నుంచి తిరుపతి మీదుగా చెన్నై వెళ్లేలా మారిస్తే..కారిడార్‌ పొడవు మరో 53.5 కి.మీ. పెరగనుంది.

అప్పుడు నాయుడుపేట, తడ తగలవు. ఈ ప్రాజెక్టులో డబుల్ ట్రాక్‌, లూప్‌లైన్లు, సైడింగ్స్‌ కలిపి మొత్తం 1,419.4 కి.మీ. ట్రాక్‌ నిర్మించాలి. ఇక, హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్‌ రైలు కారిడార్‌కు 576.6 కి.మీ., 558.2 కి.మీ., 621.8 కి.మీ.తో మూడు ఎలైన్‌మెంట్లు పరిశీలించారు. ఇందులో 576.6 కి.మీ. ఎలైన్‌మెంట్‌ను ప్రాథమికంగా ఎంపికచేశారు.

ఇది చాలావరకు ప్రస్తుతమున్న హైదరాబాద్‌-బెంగళూరు హైవేకి సమాంతరంగా వెళ్తుంది. తెలంగాణలో 4, ఏపీలో 6, కర్ణాటకలో 3 స్టేషన్లు నిర్మిస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో కియా పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలు ఉండడంతో. అక్కడ దుద్దేబండ వద్ద స్టేషన్‌ ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో తెలంగాణలో 218.5 కి.మీ., ఏపీలో 263.3 కి.మీ., కర్ణాటకలో 94.80 కి.మీ. ఉంటుంది.

డబుల్‌ లైన్, అదనంగా లూప్‌లైన్స్, సైడింగ్‌లు కలిపి మొత్తం 1,363 కి.మీ. మేర ట్రాక్‌ నిర్మిస్తారు. హైదరాబాద్‌-అమరావతి-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు మధ్య బుల్లెట్‌ రైళ్ల కారిడార్లు పూర్తయ్యి..అలాగే బెంగళూరు-చెన్నై మధ్య చేపట్టే బుల్లెట్‌ రైలు ప్రాజెక్టూ అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్, అమరావతి, చెన్నై, బెంగళూరు నగరాల మధ్య బుల్లెట్‌ రైళ్ల చతుర్భుజి వచ్చినట్లు అవుతుంది.

దీనివల్ల ఈ నగరాల మధ్య గంట నుంచి రెండు గంటల్లోనే చేరుకునే అవకాశం కలగనుంది. హైదరాబాద్‌ – చైన్నై హై స్పీడ్ ట్రైన్ కారిడార్‌లో అమరావతి, గుంటూరు, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నాయుడుపేట, తడలో స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక హైదరాబాద్‌ – బెంగళూరు కారిడార్‌లో కర్నూలు, డోన్, గుత్తి, అనంతపురం, దుద్దేబండ, హిందూపురంలో స్టేషన్లు రానున్నాయి.

Related posts

అధికారుల అలసత్వం..కాలనీ ప్రజల ఆగ్రహం!

Satyam News

తిరుమల ముంతాజ్ హోటల్ భూమి పై వాస్తవాలు ఇవి

Satyam News

మద్యం మత్తులో కారు పైకి బైక్‌తో దూసుకెళ్లిన యువకుడు

Satyam News

Leave a Comment

error: Content is protected !!