మంగళవారం రాత్రంతా కురిసిన భారీ వర్షంతో ఉత్తర తెలంగాణ జిల్లాలలో వరద పోయెత్తుతోంది. లోతట్టు గ్రామాలను తండాలను ముంచెత్తుతోంది. కామారెడ్డి జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాలు వరద నీటితో అల్లాడుతున్నాయి.. రాత్రికి రాత్రి వాన నీరు వరదలా వచ్చి ముంచెత్తడంతో దిక్కుతోచని స్థితిలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
పండుగ పూట ఆనందం లేకపోగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సిన ఆందోళనకర పరిస్థితుల్లో చాలా గ్రామాల ప్రజలు ఉన్నారు. వంట లేదు కరెంట్ లేదు.. తినడానికి ఏమీలేదు.. తాగడానికి నీళ్ళు లేవు.. చుట్టూ నీళ్ళు ఉన్నా.. తాగడానికి మంచినీళ్ళు లేని పరిస్థితి.
కామారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. వర్షం తెరిపినివ్వక పోవడంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. అల్పపీడనం వల్ల వర్షాలు కురుస్తాయనే హెచ్చరిక ఉన్నప్పటికీ ఈ స్థాయిలో అతిభారీ వర్షం కురుస్తుందని ఎవరూ ఊహించలేదు.
మరో రెండు రోజులపాటు ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ మెదక్ వరంగల్ కరీంనగర్ జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే వరద ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ఉమ్మడి నిజామాబాద్ మెదక్ జిల్లాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భారీ వర్షాలతో కామారెడ్డి జిల్లాలో పలు గ్రామాలు నీట మునగడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిపేట ఘటనపై కలెక్టర్ కు ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. వర్ష బాధితులను ఆదుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉందని చెప్పారు. అనంతరం ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో బండి సంజయ్ మాట్లాడారు. ఎల్లారెడ్డిలో తక్షణమే అవసరమైన సాయం అందించాలని ఎన్డీఆర్ఎఫ్ ను కోరారు.