పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది నేడు వాయుగుండంగా బలపడే అవకాశం కనిపిస్తున్నది. అదే విధంగా రేపు మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం కనిపిస్తున్నదని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోనసీమ, తూగో, పగో, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
కాగా కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తున్నది. అందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.