ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోంగార్డ్ ఈశ్వర్ నాయక్ కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తెలిపారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ (323) బి.ఈశ్వర్ నాయక్ సోమవారం సాయంత్రం తన స్వగ్రామం కోటకొండ దిగువ తండా నుండి ద్విచక్ర వాహనం మీద విధులకు వెళుతుండగా.. ముదివేడు క్రాస్ వద్ద రాయచోటి నుండి మదనపల్లి వైపు వెళుతున్న సిమెంట్ లారీ బలంగా వచ్చి హోంగార్డ్ ఈశ్వర్ నాయక్ ను “డీ” కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
హోంగార్డ్ ఈశ్వర్ నాయక్ మృతి పట్ల అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విధి నిర్వహణలో హోంగార్డ్స్ సిబ్బంది దురదృష్టకర రీతిలో మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. వారి కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆయన మృతిపట్ల పోలీసు అధికారులు, సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, హోంగార్డులు విచారం వ్యక్తం చేసి తంబళ్లపల్లి మండలం కోటకొండ దిగువ తండా గ్రామంలో వారి స్వగృహం నందు ఉన్న ఆయన భౌతికకాయానికి సంతాపం తెలిపి, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, వారికి మనఃశాంతిని, మనోనిబ్బరాన్ని ప్రసాధించాలని భగవంతుణ్ణి వేడుకున్నారు.
మృతునికి భార్య లక్ష్మిబాయి , కుమారుడు హర్షవర్ధన్, కుమార్తె భవ్య శ్రీ ఉన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు హోంగార్డ్ ఈశ్వర్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి, దహన సంస్కారాల నిమిత్తం 25 వేల రూపాయల నగదును ఆయన సతీమణి, లక్ష్మిబాయికి అందజేశారు.