గాజా లో ఇజ్రాయెల్ చేస్తున్న చర్యలు యుద్ధ నేరం కిందికి వస్తుందని, అది సామూహిక మారణహోమం లాంటిదని అంతర్జాతీయ సామూహిక మారణహోమ నిపుణుల సంఘం (IAGS) వ్యాఖ్యానించింది.
ప్రపంచవ్యాప్తంగా సామూహిక హింసలపై పరిశోధన చేసే అగ్రగామి సంస్థగా ఉన్న IAGS గాజాలో ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలు అంతర్జాతీయ చట్టం ప్రకారం జనసంహారం నిర్వచనానికి సరిపోతాయని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 31న ఆమోదించిన తీర్మానంలో 500 మంది సభ్యుల్లో 86 శాతం మంది మద్దతు తెలుపగా, ఇజ్రాయెల్ విధానాలు, గాజాలో సైనిక చర్యలు జనసంహారం, యుద్ధ నేరాలు మరియు మానవత్వంపై నేరాల కిందికి వస్తాయని స్పష్టం చేసింది.
1948 యుఎన్ జనసంహార కన్వెన్షన్, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రోమ్ స్టాట్యూట్ మరియు అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం స్పష్టమైన నిర్వచనాలు ఉన్నాయని వాటి ప్రకారం గాజాపై తీసుకుంటున్న చర్యలు సామూహిక హత్యల కిందికి వస్తాయని సంస్థ పేర్కొన్నది.
2023 అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆసుపత్రులు, ఇళ్లు, పాఠశాలలు, సహాయ కేంద్రాలు వంటి పౌర సౌకర్యాలపై విస్తృత స్థాయి దాడులు జరిపి 59,000 కంటే ఎక్కువ పాలస్తీనియన్లను, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలను హతమార్చగా, 1,43,000 మందికి పైగా గాయపరిచిందని రిపోర్టులో పేర్కొన్నారు.
గాజాలోని 2.3 మిలియన్ల జనాభా దాదాపు మొత్తం బలవంతపు నిర్బంధం, విచక్షణారహిత బాంబుల వర్షం, గృహాలు మరియు మౌలిక వసతుల విధ్వంసం, ఆహారం, నీరు, విద్యుత్, మందులు వంటి అవసరాల సరఫరా నిలిపివేయడం, పంట పొలాలు, ఆహార గోదాములు, బేకరీలపై దాడులు, లైంగిక హింస, చిత్రహింసలు, అన్యాయ నిర్బంధాలు, వైద్యులు, సహాయకులు, పాత్రికేయులపై దాడులు జరిగాయని పేర్కొంది.
పాలస్తీనియన్లను నాశనం చేయాలనే ఉద్దేశాన్ని ఇజ్రాయెల్ నాయకులు బహిరంగంగా ప్రకటించారని ప్రస్తావించిన ఈ తీర్మానంలో, ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ గాజా ప్రజలను బలవంతంగా తరలించే ప్రణాళికలకు మద్దతు తెలపడం యుఎన్ నిపుణులు జాతి శుద్ధి చర్యగా పేర్కొన్నారని తెలిపింది. అంతర్జాతీయ న్యాయస్థానం 2024లో మూడు సార్లు ఇచ్చిన తాత్కాలిక తీర్పుల్లో ఇజ్రాయెల్ జనసంహారం చేస్తోందని వ్యాఖ్యానించిన విషయాన్ని నివేదిక స్పష్టం చేసింది.