ప్రపంచం హోమ్

భారత్ లో రూ.5.5 లక్షల కోట్ల పెట్టుబడికి జపాన్ సిద్ధం

#Modi

భారత్‌లో వచ్చే పది సంవత్సరాల్లో 10 ట్రిలియన్ యెన్ (దాదాపు రూ.5.5 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టాలని జపాన్ లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నదది. ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్, రక్షణ, సాంకేతికత వంటి కీలక రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇరుదేశాలు భారీ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేశాయి.

ట్రంప్ ప్రభుత్వ వాణిజ్య-సుంకాల విధానాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన అనిశ్చితి మధ్య ఈ నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా మధ్య జరిగిన శిఖరాగ్ర చర్చల అనంతరం ఈ ప్రకటనలు వెలువడ్డాయి.

“జపాన్ నుంచి వచ్చే 10 ఏళ్లలో భారతదేశంలో 10 ట్రిలియన్ యెన్ పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్నాం” అని, తన పక్కన నిలిచిన ఇషిబా సమక్షంలో మోదీ మీడియా ముందు ప్రకటించారు. శుక్రవారం ఉదయం టోక్యో చేరుకున్న మోదీ, “ప్రపంచ శాంతి, స్థిరత్వానికి భారత్-జపాన్ భాగస్వామ్యం కీలకం. ఈ సంబంధాన్ని కొత్త ‘సువర్ణాధ్యాయం’ వైపు తీసుకెళ్లే బలమైన పునాది ఇరువైపులా వేసాం” అని అన్నారు.

“పెట్టుబడులు, ఆవిష్కరణలు, ఆర్థిక భద్రత వంటి విభాగాల్లో భాగస్వామ్యానికి 10 ఏళ్ల రోడ్‌మ్యాప్ రూపొందించాం” అని కూడా ఆయన వెల్లడించారు. మోదీ మాట్లాడుతూ, భారత్-జపాన్ రెండు దేశాలు స్వేచ్ఛా, ఓపెన్, శాంతియుత, సుసంపన్న, నిబంధనల ఆధారిత ఇండో-పసిఫిక్ కోసం కట్టుబడి ఉన్నాయని అన్నారు.

ఇరుదేశాలు రక్షణ పరిశ్రమ, ఆవిష్కరణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాయి. ఉగ్రవాదం, సైబర్‌ సెక్యూరిటీపై భారత్, జపాన్ ఆందోళనలు ఒకేలా ఉన్నాయని, అలాగే రక్షణ, సముద్ర భద్రత రంగాల్లో ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని మోదీ స్పష్టం చేశారు.

“భారత్-జపాన్ భాగస్వామ్యం పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉంది. ఇది జాతీయ ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుంది. పంచుకున్న విలువలు, విశ్వాసాలతో నిర్మించబడింది” అని ఆయన అన్నారు. “బలమైన ప్రజాస్వామ్య దేశాలు మంచి ప్రపంచాన్ని తీర్చిదిద్దడంలో సహజ భాగస్వాములు” అని కూడా మోదీ అన్నారు.

జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా మాట్లాడుతూ, ఇరుదేశాలు ఒకరి బలాలను మరొకరు ఉపయోగించుకొని, తదుపరి తరానికి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

Related posts

ఆరోపణలు ఉన్నా ఆగదు ప్రమోషన్

Satyam News

ఏపీ లో ఇలా జరుగుతున్నది ఏమిటి?

Satyam News

ధర్మస్థలిపై తప్పుడు ఆరోపణ చేసిన వ్యక్తి అరెస్టు

Satyam News

Leave a Comment

error: Content is protected !!