మేనమామపై యుద్ధానికి మేనల్లుడు వస్తున్నాడా? నేడు జరిగిన పరిణామాలు చూస్తుంటే మేనమామ జగన్ రెడ్డిపై యుద్ధానికి మేనల్లుడు రాజారెడ్డి సిద్ధం అవుతున్నట్లే అర్ధం అవుతున్నది. పిసిసి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల కుమారుడు వై ఎస్ రాజారెడ్డి కర్నూలు ఉల్లి మార్కెట్ సందర్శన సమయంలో కనిపించడం తో ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలకు దారితీసింది.
ప్రస్తుతం షర్మిల కుమారుడు రాజారెడ్డి క్రైస్తవ మత ప్రచారకుడుగా ఉన్నాడు. ముందుగా రాజారెడ్డి తన అమ్మమ్మ వై ఎస్ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నట్లు సమాచారం. అనంతరం షర్మిలతో పాటు ఉల్లి మార్కెట్‌లో ప్రత్యక్షమయ్యారు. ఈ క్రమంలో స్థానికులు, పార్టీ కార్యకర్తలు ఆయనపై ప్రత్యేక దృష్టి సారించారు.
సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నప్పటికీ, రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. వై ఎస్ షర్మిల కూడా ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే వై ఎస్ కుటుంబ వారసత్వాన్ని కొనసాగించే అవకాశముందన్న ఊహాగానాలను ఈ పరిణామాలు బలపరిచాయి. కర్నూలులో జరిగిన ఈ సందర్శన భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయ సమీకరణలపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.
ఇప్పటికే తన మేనమామ జగన్ రెడ్డి ఆస్తి లో భాగం ఇవ్వకుండా, రాజకీయ పరంగా కూడా మోసం చేసి తన తల్లి షర్మిలను అవమానించాడు. తన తండ్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి తన పిల్లలను జగన్ పిల్లల్ని సమానంగా చూసి ఆస్తి వాటాలు సమంగా తీసుకోవాలని చెప్పినా జగన్ రెడ్డి అలా చేయలేదు.
దాంతో తన పిల్లలకు అన్యాయం జరిగిందని పలుమార్లు షర్మిల మీడియా ఎదుట వాపోయింది. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు షర్మిల భర్త అనిల్ వెళ్లినా తీవ్రంగా అవమానించి పంపించాడు. ఇలా అన్ని విధాలుగా అన్యాయానికి గురి అయిన షర్మిల తన కుమారుడిని రంగంలోకి దించుతున్నట్లుగా పరిశీలకులు అంటున్నారు.