ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు ముహూర్తం ఖరారు అయింది. అక్టోబర్ 22 నుంచి 24వ తేదీ వరకు దుబాయ్, అబుదాబి, యూఏఈలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా పార్టనర్ షిప్ సమ్మిట్ -2025 జరగనుంది. ఈ సమ్మిట్‌కు విదేశీ పెట్టుబడుదారులను ఆహ్వానించేందుకు ఆయా దేశాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో పెట్టుబడులను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
అలాగే రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాల్లో సైతం పెట్టుబడుదారులకు ఆయన స్వాగతం పలకనున్నారు. ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలతోపాటు పరిశ్రమలు, పెట్టుబడులు, ఏపీఐఐసీ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. సీఎం చంద్రబాబు చేస్తున్న ఈ విదేశీ పర్యటనకు జీఎడీ పొలిటికల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా బుధవారం అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.