ఐదు సంవత్సరాల విరామం తర్వాత భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు ఈ నెలాఖరులోగా పునఃప్రారంభం కానున్నాయి. తూర్పు లడఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ (MEA) ప్రకటించింది.
గత ఆగస్టు 31న చైనాలోని టియాంజిన్ నగరంలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమైన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. 2020లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా భారత్-చైనా నేరుగా విమాన సర్వీసులు నిలిపివేయబడ్డాయి. అనంతరం లడఖ్‌లో నాలుగేళ్లకు పైగా కొనసాగిన సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా అవి తిరిగి ప్రారంభం కాలేదు.
గత అక్టోబరులో ఆ వివాదం ముగియడంతో సర్వీసులు పునరుద్ధరించేందుకు మార్గం సుగమమైంది. “ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇరుదేశాల మధ్య సివిల్ ఏవియేషన్ అధికారులు సాంకేతిక స్థాయి చర్చలు జరిపారు. నూతన ఎయిర్ సర్వీసుల ఒప్పందం ప్రకారం అక్టోబర్ చివరి నాటికి నేరుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి” అని విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది.
ఈ నిర్ణయం ద్వైపాక్షిక సంబంధాల సాధారణీకరణకు తోడ్పడటమే కాకుండా ఇరుదేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలను మరింతగా పెంపొందిస్తుందని మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ “భారత్-చైనా మధ్య నేరుగా విమాన సర్వీసులు అక్టోబర్ చివరినాటికి పునఃప్రారంభం కానున్నాయి.
ఇది ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరుస్తూ, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుతుంది” అని తెలిపింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, గత జూన్ 2020లో గల్వాన్ లోయ ఘర్షణల అనంతరం భారత్-చైనా సంబంధాలు 1962 యుద్ధం తర్వాత అత్యంత దిగువ స్థాయికి చేరుకున్నాయి. అనంతరం జరిగిన పలు సైనిక, దౌత్య చర్చల తరువాత ఇరుదేశాలు తూర్పు లడఖ్‌లోని వివిధ ప్రాంతాల నుండి సైనికులను వెనక్కి తీసుకున్నాయి.
ఇక గత అక్టోబరులో డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో చివరి రెండు వివాదాస్పద ప్రాంతాల నుంచి కూడా సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని ఒప్పందం కుదిరింది. దాని తరువాత మోదీ, జిన్‌పింగ్ రష్యాలో జరిగిన BRICS సదస్సు సందర్భంగా భేటీ అయి సంబంధాల మెరుగుదలకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల ఇరుదేశాలు కైలాస్ మానససరోవర్ యాత్రను పునఃప్రారంభించడాన్ని కూడా అంగీకరించాయి.