వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐ.డి.ఒ.సిలో సమాచార హక్కు చట్టం – 2005కు సంబంధించిన పెండింగ్ అప్పిళ్ల పరిశీలనకు ఈ నెల 23న వనపర్తి జిల్లాకు నలుగురు రాష్ట్ర సమాచార కమిషనర్లు వస్తున్నారని వనపర్తి జిల్లా ఇంచార్జి కలెక్టర్ విజయిందిర బోయి తెలిపారు. ఇందులో భాగంగా సమాచార కమిషనర్లు వైష్ణవి మెర్ల, పి.వి. శ్రీనివాస రావు, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డి ఆగస్టు 22న జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించి సమాచార హక్కు చట్టం 2005 ద్వారా పెండింగ్ లో ఉన్న అప్పిళ్లను పరిష్కరిస్తారు. ఆగస్టు22న గద్వాలకు, 23న వనపర్తికి వస్తారని చెప్పారు.
గత కొన్ని సంవత్సరాలుగా సమాచార కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ల పోస్టులు ఖాళీ ఉండటంతో సమాచార హక్కు చట్టం – 2005 ద్వారా దరఖాస్తులు చేసుకున్న అప్పిళ్లు అనేకం పెండింగ్ లో ఉండిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక సమాచార కమిషనర్లను నియమించడంతో పెండింగ్ లో ఉన్న అప్పిళ్లను పరిష్కరించేందుకు మార్గం సుగమమయ్యాయి.
ఆగస్టు 23న సమాచార కమిషనర్లు వనపర్తి జిల్లాకు చేరుకొని ఉదయం 11.30 గంటలకు సమీకృత కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జిల్లాలోని పౌర సమాచార అధికారులు, అప్పీలేట్ అధికారులకు సమాచార హక్కు చట్టం పై అవగాహన కల్పిస్తారు. అనంతరం పెండింగ్ అప్పిళ్లపై సమీక్ష నిర్వహిస్తారు. వనపర్తి జిల్లాకు సంబంధించిన దాదాపు 90 పెండింగ్ అప్పిళ్లను పరిశీలించి పరిష్కరిస్తారని తెలిపారు. జిల్లాలోని ప్రజలు సమాచార హక్కు చట్టం కు సంబంధించిన తమ ఫిర్యాదులు ఉంటే కమిషనర్ల ముందు హాజరై తమ ఫిర్యాదులు పరిష్కరించుకోవాలని కోరారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్